మార్చి ఒకటి నుండి పసుపు రైతుల నిరాహార దీక్ష

Feb 28,2024 23:21

ప్రజాశక్తి – వేమూరు
గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపును కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మార్చి 1నుండి 3వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య తెలిపారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని పసుపు రైతులు ధర్నాకు అధిక సంఖ్యలో రావాలని కోరారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదం జరిగి సుమారు 40రోజులు కావస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఈ పరిస్థితిలో ధర్నా చేయక తప్పడం లేదని తెలిపారు. కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. దుగ్గిరాల తహశీల్దారు కార్యాలయం వద్ద జరిగే రిలే దీక్షలకు రైతులు హాజరై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక సాంబిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జై బాలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా సహా కార్యదర్శి బోనిగల సుబ్బారావు, రైతు సంఘం నాయకులు బ్రహ్మయ్య, సాంబశివరావు పాల్గొన్నారు.

➡️