బిజెపిలో గడబిడ

Mar 4,2024 10:29 #BJP, #Trouble
  • పోటీ చేయబోనన్న భోజ్‌పురి స్టార్‌ పవన్‌సింగ్‌
  • రాజకీయాల నుంచి తప్పుకున్న కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ : బిజెపి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి 24 గంటలు తిరక్కముందే ఆ పార్టీలో గడబిడ మొదలైంది. భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌సింగ్‌ తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని తాజాగా ప్రకటించి పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేశారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి పవన్‌సింగ్‌ పోటీ చేస్తారని శనివారం బిజెపి ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కొన్ని కారణాల వల్ల నేను ఎన్నికల్లో పోటీ చేయలేను’ అని ఆయన ఆదివారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బెంగాల్‌ మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, విద్వేషపూరిత వీడియోలు చేసినందుకు అసన్‌సోల్‌ సీటు బహుమతిగా ఇచ్చారంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పోటీచేయబోనని ప్రకటించినట్లు తెలిసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, ఢిల్లీలోని ఛాందిని చౌక్‌ సిట్టింగ్‌ ఎంపి డాక్టర్‌ హర్షవర్ధన్‌ను నాయకత్వం విస్మరించడంతో క్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానని ఆయన ప్రకటించారు. బిజెపి శనివారం ప్రకటించిన 195 మంది ఎంపి అభ్యర్థుల తొలిజాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఛాందిని చౌక్‌ నుంచి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ పోటీ చేస్తారని బిజెపి ప్రకటించింది. ఐదుసార్లు అసెంబ్లీకి, రెండు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యానని ఆయన గుర్తు చేశారు. కృష్ణానగర్‌లోని తన ఇఎన్‌టి క్లినిక్‌ తన కోసం ఎదురుచూస్తోందంటూ పోస్ట్‌ చేశారు.

➡️