Tripura : అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవికి అమినేష్‌ దెబ్బర్మ రాజీనామా

Mar 7,2024 12:17 #resigns, #Tripura LoP

 అగర్తల :   త్రిపుర అసెంబ్లీ ప్రతిపక్షనేత (ఎల్‌ఒపి) పదవికి సీనియర్‌ తిప్ర మోత పార్టీ నేత అనిమేష్‌ దెబ్బర్మ గురువారం రాజీనామా చేశారు. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బృషకేత్‌ దెబ్బర్మతో కలిసి బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజీనామా సమర్పించిన అనంతరం అమినేష్‌ దెబ్బర్మ మీడియాతో మాట్లాడారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. బిజెపి, ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపిఎఫ్‌టి)ల సంకీర్ణ సంకీర్ణ ప్రభుత్వంలో చేరడంతో తమకు రెండు మంత్రి పదవులు దక్కాయని అన్నారు.

60 మంది సభ్యులు కలిగిన త్రిపుర అసెంబ్లీలో తిప్ర మోతాకు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాణిక్‌ సాహా సహా రాష్ట్రంలో 9 మంది మంత్రులు ఉన్నారు. అయితే నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో సిఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉండవచ్చు.

త్రిపురలోని సాంప్రదాయ ప్రజల  సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు త్రైపాక్షిక ఒప్పందంపై ఇటీవల తిప్ర మోతా, త్రిపురలోని బిజెపి, ఐపిఎఫ్‌టి సంకీర్ణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంతకాలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

➡️