విహారయాత్రలో విషాదం : గుజరాత్‌లో బోటు ప్రమాదం : 14 మంది చిన్నారులతో సహా 16 మంది మృతి

అహ్మదాబాద్‌ : పశ్చిమ గుజరాత్‌లోని ఘోరం చోటుచేసుకుంది. వడోదరలోని సరస్సులో గురువారం జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన, ప్రమాదానికి గురైన పిల్లలందరూ పదేళ్ల వయసువారేనని అధికారులు తెలిపారు. స్కూలు యాజమాన్యం నిర్వహిస్తున్న పిక్నిక్‌కు పిల్లలు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిగిలిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరణించిన వారిలో ఒక టీచరు కూడా వున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఆ సమయంలో బోటులో 27మంది వున్నారని వడోదర మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌ రాణా నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, అస్వస్థతకు గురైన వారికి రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సాయాన్ని స్థానిక యంత్రాంగం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

➡️