జిఒ 3 చట్టబద్ధతకు ఆర్డినెన్స్‌, స్పెషల్‌ డిఎస్‌సి కోసం కలెక్టరేట్‌ ముట్టడి 

tribes unemployees protest for special DSC

పాడేరులో గిరిజనుల భారీ ర్యాలీ, రంపచోడవరం, చింతూరుల్లో ధర్నా

ప్రజాశక్తి – పాడేరు, రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)జిఒ నంబర్‌ 3 చట్టబద్ధతకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని, గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అల్లూరి జిల్లా పాడేరు కలెక్టరేట్‌ను సోమవారం గిరిజనులు ముట్టడించారు. ‘చలో పాడేరు’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏజెన్సీ నలుమూలల నుంచి గిరిజన యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. వారినుద్దేశించి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌, ఏజెన్సీ ప్రత్యేక డిఎస్‌సి సాధన కమిటీ కన్వీనర్‌ నరేష్‌, కో- కన్వీనర్‌ నారాయణరాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6100 డిఎస్‌సి ఉపాధ్యాయ పోస్టుల్లో 1025 పోస్టులు గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించారని, 517 పోస్టులు నోటిఫై చేశారని, అందులోనూ 38 పోస్టులు మాత్రమే ఆదివాసీలకు కేటాయించారని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఐదు శాతం గిరిజనేతరులకు 95 శాతం ఉద్యోగాలు, 95 శాతం మంది ఆదివాసీలకు ఐదు శాతం ఉపాధ్యాయ పోస్టులు కేటాయించడం దారుణమన్నారు. ఈ నిర్ణయంతో అదివాసీ యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలను ఆదివాసీలకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ మాతృభాషా వలంటీర్లను రెన్యువల్‌ చేయాలని, వారికి మినిమం స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చలో కలెక్టరేట్‌ కార్యక్రమానికి ఆదివాసీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి హైమావతి, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు శాంతి కుమారి మద్దతు తెలిపారు. రంపచోడవరం ఐటిడిఎ వద్ద గిరిజనులు ధర్నా నిర్వహించారు. అనంతరం పిఒ సూరజ్‌ గనోరేకు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, టిడిపి మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మద్దతు తెలిపారు. చింతూరు ఐటిడిఎ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఆదివాసీ ప్రజా ప్రతినిధులు పూనెం ప్రదీప్‌కుమార్‌, వి.రాజ్‌ కుమార్‌ మాట్లాడారు.

 

 

 

 

 

➡️