గిరిజనలు, గిరిజన పక్షపాతుల మద్యే పోరు

Apr 4,2024 21:45

గిరిజన ద్రోహులు, గిరిజన పక్షపాతుల మధ్య పోరాటాన్ని తలపించే విధంగా అరకు ఎమ్‌పి ఎన్నిక కనిపిస్తోంది. 50 శాతంపైగా గిరిజనులున్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆరు ఎస్‌టి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక ఎస్‌సి రిజర్వుడు నియోజకవర్గం ఉన్నాయి. అరకు పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకసారి, వైసిపి అభ్యర్థులు రెండుసార్లు విజేతలుగా నిలిచారు. గిరిజనుల ఓట్లతో విజయం సాధించిన ఎమ్‌పిలైన నాయకులు ఒడ్డు దాటిన తర్వాత ఓడ మల్లయ్య చందంగా తయారైన పరిస్థితి ఏర్పడింది. మరోసారి అరకు ఎమ్‌పి బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి పార్టీల నేపథ్యం పరిశీలిస్తే…

ప్రజాశక్తి-సాలూరు : గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణలో ఇప్పుడు పోటీలో ఉన్న వైసిపి, టిడిపి కూటమి వైఖరులు ఒకే విధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. జిఒ నెంబర్‌ 3, అటవీ హక్కుల చట్టం, బోయ, వాల్మీకులను ఎస్‌టిలో చేర్చడం, 1/70 చట్టం అమలు, షెడ్యూల్‌లో లేని గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేయడం వంటి అంశాలలో అనేక సంవత్సరాలుగా పాలక పార్టీలు దోబూచులాట ఆడుతున్నాయి. బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చాలంటూ మొదట టిడిపి ప్రభుత్వం ప్రతిపాదించగా, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. దీనిపై వైసిపి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంపై ఆదివాసీ గిరిజన సంఘం సహా అనేక సంఘాలు భగ్గుమన్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యేలను నిలదీశాయి. అరకు పార్లమెంటు పరిధిలో ఆరుగురు వైసిపి ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరూ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించలేదు. కనీసం వారి స్పందన తెలియజేయలేదు. ఏజెన్సీలో గిరిజనులకు వందశాతం ఉద్యోగాలకు సంబంధించిన జిఒ నెంబర్‌ 3 రద్దు విషయంలోనూ వైసిపి ప్రభుత్వం మొక్కుబడిగా స్పందించింది. కానీ చిత్తశుద్ధితో దానిపై పోరాడలేదు. 1/70 చట్టం అమలు విషయంలో అటు టిడిపి, ఇటు వైసిపి ప్రభుత్వాలు రెండూ కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నాయి. ఈ చట్టాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తుండడంతో షెడ్యూల్‌ ఏరియాలో గిరిజనేతరుల ప్రాబల్యం పెరిగిపోతూ వస్తోంది. దీనివల్ల గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. షెడ్యూల్లో లేని గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు పోరాడుతున్నా ప్రస్తుత పాలకపార్టీలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దొందూ దొందేరాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల వైఖరి గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణ విషయంలో ఒకే విధంగా ఉంది. కేంద్రంలో గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి మొదటి నుంచి గిరిజన చట్టాల్ని నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తోంది. మరోవైపు గిరిజన చట్టాలు హక్కుల పరిరక్షణ విషయంలో జనసేన లాంటి పార్టీకి ఒక విధానమంటూ లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న అరకు ఎమ్‌పి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా డాక్టర్‌ తనూజా రాణి, టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. వైసిపి అభ్యర్థి తనూజా రాణి.. అరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ కోడలు. ఎమ్మెల్యేగా చెట్టి ఫల్గుణపై తీవ్రమైన అవినీతి, భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఆయన గిరిజనుల భూములే ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి ఎమ్మెల్యే కుటుంబ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన తనూజా రాణి గిరిజనులకు ఏమేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. టిడిపి కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత 2014లో వైసిపి ఎమ్‌పిగా పోటీచేసిన గెలిచారు. తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి, బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. ఆమె గెలిచిన తరువాత ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు లేవు. గిరిజన సమస్యలపై పార్లమెంటులో గొంతు వినిపించిన సందర్భం కూడా లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో గిరిజన యూనివర్సిటీని తొలుత పాచిపెంట మండలంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ సమయంలో ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం కూడా చేయలేదు. గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసినా ఆమె కిమ్మనలేదు. వీటన్నిటి కన్నా ఆమె గిరిజన నాయకురాలు కాదనే వివాదం నడుస్తోంది. ఎస్‌టి వాల్మీకి తెగకి చెందిన నాయకురాలినని చెప్పుకుంటున్నా వివాదం మాత్రం వెంటాడుతూనే ఉంది. బిజెపి పార్వతీపురం మన్యం జిల్లా నాయకులే ఆమెకి ఎమ్‌పి సీటు ఇవ్వొద్దని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పొత్తులో భాగంగా టిడిపి నాయకత్వం అంగీకరించినా స్థానిక టిడిపి నాయకులు చాలామంది ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. గిరిజనుల పక్షాన సిపిఎంఅరకు ఎమ్‌పి బరిలో సిపిఎం నుంచి గిరిజన నాయకులు అప్పలనర్స ఉన్నారు. ఆయన అరకు, పాడేరు ప్రాంతంలో అనేక గిరిజన ఉద్యమాల్లో పాల్గొన్నారు. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణ విషయంలో పోరాటాలు చేశారు. బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం నడిపించారు. గిరిజనులకు ద్రోహం చేసిన రెండు పార్టీల అభ్యర్థులు, గిరిజనుల పక్షాన పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి మధ్య అరకు యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో గిరిజనులు ఎవరి పక్షాన నిలబడతారనేది తేలాల్సి ఉంది.

➡️