భూ కుంభకోణాలపై న్యాయవిచారణ

Nov 28,2023 10:20 #land scams

 

ప్రజాశక్తి-ఒంగోలు :  కలెక్టరేట్‌ ఒంగోలులో నకిలీ స్టాంపులు, భూ కుంభకోణాలు, భూ ఆక్రమణలుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట సిపిఎం, సిపిఐ నాయకులు సోమవారం ధర్నా చేపట్టారు. భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి జి.రమేష్‌ మాట్లాడుతూ.. ఒంగోలులో నకిలీ స్టాంపులు భూ కుంభకోణాలు, భూఆక్రమణలపై సిట్‌ విచారణ జరుగుతోందని, విచారణలో భూములకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ అధికారులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారన్నారు. దీంతో భూమి ఆక్రమణకు గురైన బాధితులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. అధికార పార్టీ అండదండలతో పోలీస్‌ స్టేషన్‌లో కొన్ని కేసుల్లో రాజీ జరుగుతోందన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. భూముల కోల్పోయిన బాధితులకు వెంటనే భూమిని అప్పగించాలని కోరారు. నకిలీ స్టాంపుల తయారీదారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి పివిఆర్‌.చౌదరి మాట్లాడుతూ.. అక్రమ జిపిలు చేసిన రిజిస్ట్రేషన్‌ అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం గ్రీవెన్స్‌ సెల్‌లో సంయుక్త కలెక్టర్‌ కె.శ్రీనివాసులును కలసి భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు.

➡️