మత రాజ్యం దిశగా..

Jan 24,2024 07:15 #Editorial

              అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపనను మత పరమైన కార్యక్రమంగా కాకుండా బిజెపి, ఆరెస్సెస్‌ తమ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు దుర్వినియోగపరచిన తీరు ముమ్మాటికీ ఆక్షేపణీయం. దేశంలో లౌకిక, ప్రజాతంత్ర విలువలను తుంగలో తొక్కి దేశాన్ని మత రాజ్యంగా దిగజార్చేందుకు సంఫ్‌ు పరివార్‌ దూకుడుగా ముందుకెళ్తోంది. మతపరమైన జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న బిజెపి అయోధ్య రాముడిని రాజకీయ రాముడిగా మార్చేందుకు యత్నించింది. మూడేళ్ల క్రితం అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ప్రధాని హాజరై భూమి పూజ చేయడం, నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో రాజ దండం ప్రదర్శించడం దగ్గర నుంచి తాజాగా బాల రాముడి ప్రతిష్టాపనలో అన్నీ తానై వ్యవహరించడం దాకా మోడీ వ్యవహరించిన తీరు బిజెపి, ఆరెస్సెస్‌ హిందూత్వ ఎజెండాలో భాగమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మోడీ భజన కార్యక్రమంగా మార్చేశారు. ప్రాణప్రతిష్ఠ తీరును విభేదిస్తూ ప్రధానమైన నాలుగు మఠాల శంకరాచార్యులు కార్యక్రమానికి హాజరు కాలేమని తేల్చి చెప్పడం సంఫ్‌ుపరివార్‌ది ఫక్తు రాజకీయ ఎజెండా అని స్పష్టం చేస్తున్నది. సౌమ్యుడిగా, సాకేత రాముడిగా ఆరాధించే రాముడి చిత్రాన్ని ఆగ్రహంగా, హింసాత్మకంగా, కండలు తిరిగిన మానవాతీత వ్యక్తిగా చిత్రీకరిస్తూ అయోధ్య అంతటా పోస్టర్లు అంటించారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠతో దేశంలోని సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్లుగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధీనంలోని ప్రధాన కార్పొరేట్‌ మీడియా అంతా ఊదరగొట్టింది.

1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేతను క్రిమినల్‌ నేరంగా, తీవ్రమైన చట్ట ఉల్లంఘనగా దేశ అత్యున్నత న్యాయస్థానం 2019లో ప్రకటించింది. అదే సమయంలో విశ్వాసాల పేరుతో మసీదు కూల్చివేసిన చోట గుడికట్టాలని తీర్పిచ్చింది. వాస్తవమిది కాగా, అయోధ్యలో సత్యం, న్యాయమే గెలిచాయని, బాబ్రీ మసీదును కూల్చివేయడం సరైనదేనన్నట్టుగా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈసారి ఎన్నికల్లో గనుక బిజెపి గెలిస్తే, భారత దేశాన్ని మత రాజ్యంగా మార్చేస్తుంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రామాలయ ప్రారంభోత్సవ రోజున ఒక పూట సెలవు ప్రకటించగానే, బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సెలవు ప్రకటించాయి. అంతేకాదు ప్రభుత్వ సొమ్ముతో అయోధ్యకు ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పించాయి. దీనిని దీటుగా ఎదుర్కోవాల్సిన బిజెపియేతర పార్టీలు మృదు హిందూత్వ, హిందూత్వతో పోటీపడడం వంటి వాటికి పాల్పడడం సంఫ్‌ుపరివార్‌ పని మరింత సులువు చేస్తోంది. అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన సమయంలో ఢిల్లీలో సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని ఆమాద్మీ పార్టీ నిర్వహించగా, కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలయాల్లో పూజలు చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు ప్రత్యేక విమానాల్లో అయోధ్యకు తరలివెళ్లి మెజార్టీ మత రాజకీయాలకు తాము వ్యతిరేకం కాదని చాటుకున్నారు.

తొలి భారత ప్రధాని నెహ్రూ సోమనాధ్‌ ఆలయ సందర్శనకు అధికారిక హోదాలో వెళ్లవద్దని నాటి రాష్ట్రపతికి సూచించారు. నేటి ప్రధాని అందుకు భిన్నంగా వ్యవహరించారు. వామపక్షాలు, ఆర్జేడి, డిఎంకె వంటి కొన్ని పార్టీలు మాత్రమే నికరంగా బిజెపి మత రాజకీయ ఎజెండాను వ్యతిరేకించాయి. మతతత్వాన్ని, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టే బిజెపి ఎజెండాకు కార్పొరేట్‌ శక్తులు మద్దతుగా నిలిచాయి. అయోధ్య ఎజెండా ముగియగానే కాశీ, మధుర మసీదులను బిజెపి, ఆరెస్సెస్‌ తెరపైకి తీసుకొస్తున్నాయి. దీనిపై వివాదాలు రేకెత్తించేందుకు ఇప్పటికే సంఫ్‌ుపరివార్‌ న్యాయస్థానాలను ఆశ్రయించింది.. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని పాలనను కలగాపులగం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ పోరాడాలి. భిన్నమతాలు, జాతులు, సంస్కృతులతో కూడిన భారత దేశ ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు, మత రాజకీయాలను ఓడించేందుకు బిజెపిని రాజకీయంగా ఒంటరిపాటు చేయాలి.

➡️