Toll Charges : పెరిగిన టోల్‌ ఛార్జీలు – నేటి నుండే అమలు..!

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో టోల్‌ ప్లాజా ఛార్జీలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది. టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్‌ 1 తేదీన టోల్‌ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన పన్ను రుసుములు అమల్లోకి వచ్చాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపుకు రూ.5, రానూపోనూ కలిపి రూ.10, భారీ రవాణా వాహనాలకు రూ.35, రూ.50 చొప్పున పెంచారు. 2025 మార్చి 31 వరకు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. పంతంగి వద్ద కారు ఒకవైపు ధర రూ.95, రానూపోనూ రూ.145, కొర్లపహాడ్‌ వద్ద రూ.130, రూ.195, చిల్లకల్లు వద్ద రూ.110, రూ.160గా ఉన్నాయి. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుంలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. స్థానికుల నెలవారీ పాస్‌ను రూ.330 నుంచి 340కి పెంచారు. ఫాస్టాగ్‌ అమల్లోకి వచ్చాక టోల్‌ ప్లాజాల వద్ద వసూళ్లు కూడా భారీగా పెరిగాయి.

➡️