పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేలా..

Mar 11,2024 10:21 #feature

పిల్లలకు కొన్ని సబ్జెక్టులు ఒక పట్టాన అర్థం కావు. ముఖ్యంగా ఏవి, అంటే లెక్కలు, సైన్సు అని ఠక్కున చెప్పేస్తారు చాలామంది. కానీ ఇంకో సబ్జెక్టు కూడా ఉంది. అదే హిందీ. ఆ సబ్జెక్టుపై పట్టు ఉన్న విద్యార్థులు చాలా తక్కువమంది ఉంటారు. ఆరో తరగతి నుండి ఆ భాష పరిచయమవుతుంది. అక్షరాలు, పదాలు కొత్తగా ఉంటాయి. బాగా చదివే పిల్లలు బాగానే ఒంటబట్టించుకున్నా ఒక మాదిరి చదివే పిల్లలు మాత్రం ఆ సబ్జెక్టులో వెనుకబడే ఉంటారు. అయితే సత్యసాయి జిల్లా పరిగి మండలం ఎంపియుపి స్కూల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అక్కడి పిల్లలంతా హిందీ భాషపై మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. స్కూలు అసిస్టెంట్‌గా హిందీ ఉపాధ్యాయురాలు హెప్జిబా గ్రేస్‌ ఆ పిల్లలకు ఆవిధంగా తర్ఫీదు ఇస్తున్నారు. ఆమె సామాజిక సేవలో కూడా ముందుంటారు. సంగీతంపై మక్కువతో సంగీత సాధన చేసి ఆన్‌లైన్లో 4 వేల మందికి పైగా ఉచిత క్లాసులు నిర్వహిస్తున్నారు.

విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న గ్రేస్‌ స్వగ్రామం… గుంతకల్‌ అనంతపురం. ఆమె ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి, హిందీపై పట్టు ఉన్న ఆమె టీచింగ్‌లో హిందీ భాషను ఎంచుకున్నారు. అలా 2002లో పరిగి మండలం కోనాపురం ఎంపియుపి పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. అప్పటి నుండి 22 ఏళ్ల సర్వీసులో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. పదేళ్ల కాల పరిమితితో కోనాపురం పాఠశాల నుండి ట్రాన్స్‌ఫర్‌ అయి వివిధ జిల్లాలకు వెళ్లారు. మళ్లీ ఇప్పుడు కోనాపురం పాఠశాల్లోనే పదోన్నతి మీద విధులకు హాజరై 5 ఏళ్లుగా బోధన చేస్తున్నారు.

                                                                          సులభంగా నేర్పిస్తున్నారు

‘పిల్లలకు ఏదైనా చెప్పాలంటే.. ముందు వారికి అది ఎంత సులభమో అర్థమయ్యేలా చెప్పాలి. చదువైనా, ఆటైనా, పాటైనా పిల్లలకు కొత్త అభ్యసనాలు. మేం చేయలేం, మా వల్ల కాదు, అన్న ధోరణిలో ఉండిపోయి చదువులో వెనుకపడిన పిల్లలు ఎందరో ఉంటారు. నా సబ్జెక్టులో మాత్రం ఆ పరిస్థితి రాకూడదని అనుకుంటాను. ఆ దిశగానే ప్రణాళికలు వేసుకుంటాను’ అని చెబుతున్న గ్రేస్‌, హిందీ అక్షరాలు సులభంగా అర్థమయ్యేందుకు తెలుగు అక్షరమాలనే ఉపయోగిస్తారు. వాటి నుండే హిందీ అక్షరాలు ఎలా రాయాలో నేర్పిస్తారు. అక్షరాలను రాయడం, గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వాళ్లు నేర్చుకున్న అక్షరాలను వార్తా పత్రికల్లో గుర్తించే వీలు కల్పిస్తున్నారు. కథలు, పద్యాలను కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంగా నేర్చుకునేలా చేయడం ఆమె ప్రతిభ. గ్రేస్‌ తరగతి గది అంతా అభ్యసన పరికరాలతో నిండిపోయి ఉంటుంది. ఆమె ఏ స్కూల్లో పాఠాలు చెప్పినా ఆ స్కూల్లో పిల్లలందరూ హిందీ భాషపై మంచి ప్రావీణ్యం కనబరుస్తారు.

                                                                                   సామాజిక సేవలో …

ఉపాధ్యాయురాలిగా బాధ్యతాయుత విధులు నిర్వహిస్తున్న గ్రేస్‌, పిల్లలను సామాజిక సేవలో భాగం చేస్తున్నారు. మొక్కలను నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు, మాక్‌ పోలింగ్‌ నిర్వహించడం, బాల్యవివాహాల పట్ల అవగాహన కల్పించడం, ఆడపిల్లలకు చదువు పట్ల ఆసక్తి కలిగించడం, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలకు రప్పించడం ఆమె దినచర్యల్లో ముఖ్యమైనవి. వీటిల్లో భాగంగా స్కూల్లో విద్యనభ్యసించే వికలాంగ పిల్లలకు, పేద పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి తన సొంత ఖర్చుతోనే సమకూరుస్తారు. స్కూల్లో ప్రత్యేక రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలకు పిల్లలకు పంచిపెట్టే స్వీట్లు ఆమే స్వయంగా వండి తీసుకెళతారు. కూతురుని స్కూలుకు తీసుకెళ్లినప్పుడల్లా, పాపతో పంపిణీ చేయడం ఆనవాయితీగా చేస్తున్నారు. ఎంతలా అంటే పాప స్కూలుకు వస్తే తమకు ఏదో ఒక బహుమతి ఇస్తారు అని పిల్లలు భావిస్తారు.

                                                                                     సంగీతంపై ఆసక్తితో..

ఉపాధ్యాయురాలిగా, సామాజిక సేవకురాలిగా సేవలందిస్తున్న గ్రేస్‌కి సంగీతం పట్ల ఉన్న ఆసక్తి, ఆమెని మరో మెట్టు పైకెక్కించింది. కూతురికి సంగీత పాఠాలు నేర్పించాలని వెళ్లిన ఆమె ఆ తరువాత తానే ఆ విద్యను అభ్యసించారు. సాధన చేయడమే కాదు, పదిమందికీ దాన్ని పంచిపెడుతున్నారు. ఆన్‌లైన్లో సంగీత క్లాసులు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా 40 మంది వాలంటీర్లను నియమించుకుని మరీ సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. మన దేశంలోనే కాక, విదేశాల నుంచి మొత్తం 4 వేల మంది విద్యార్థులు ఈ స్కూల్లో ఉచిత శిక్షణ తీసుకుంటున్నారు. విద్య నేర్చుకునే వాళ్లల్లో 8 ఏళ్ల నుండి 70 ఏళ్ల వరకు ఉంటారు. ‘సంగీత కాలేజీలో వాలంటీర్లందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే. జీతాలు తీసుకోకుండా వారంతా పనిచేస్తున్నారు. నేనొక్కదాన్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించలేను. ఎంతోమంది నాతో చేయి కలిపారు. కాబట్టే ఒక్కో మెట్టు అధిగమిస్తున్నాను’ అని తన నైపుణ్యాన్ని పదిమంది భాగస్వామ్యానికి అందేలా చేస్తున్నారు.

                                                                               అవార్డులు, రివార్డులు

ఉపాధ్యాయురాలిగా గ్రేస్‌ చేసిన సేవలను గుర్తించి 2023లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికచేశారు. సంగీత పాఠశాల ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తున్నందుకు ‘ఇంటర్నేషనల్‌ స్టార్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌ సెయింట్‌ థామస్‌ క్యాథడ్రిల్‌లో 300 మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఏకధాటిగా గంటసేపు కీబోర్డ్‌ ప్లే చేసినందుకు ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించారు.
                    – జ్యోతిర్మయి

➡️