ఎంపీ బహిష్కరణ అప్రజాస్వామికం

Dec 14,2023 07:40 #Boycott, #MP, #Parliament Session, #TMC
tmc mp mahua moitra Boycott

తృణమూల్‌ ఎంపీ మొహువా మొయిత్రీని లోక్‌సభ అనైతిక వర్తనం, ధిక్కారం ప్రాతిపదికన బహిష్కరించింది. ఆమె తన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పార్లమెంట్‌లో ప్రశ్నలు సంధించడానికి ఉపయోగించాల్సిన తన వ్యక్తిగత ఖాతా పాస్‌వర్డ్‌ ఇతరుల చేతిలో పెట్టడం. ఆ చర్య ద్వారా లోక్‌సభ గౌరవం కోల్పోయే అవకాశం ఉన్నందున ధిక్కార చర్యగా నేరారోపణ. అలా చెయ్యడం మామూలేనంటూ, అయినా అది ధిక్కార చర్యగా నిబంధనల్లో రాసి లేదన్నది ఆమె వాదన. ఇక రెండోది ఒక కంపెనీ వారి నుండి డబ్బులు తీసుకుని, వారి ప్రత్యర్థి కంపెనీపై లోక్‌సభలో ప్రశ్నలు గుప్పించడం ద్వారా అనైతికంగా ప్రవర్తించడం. ఈ విషయాలపై ఎథిక్స్‌ కమిటీ విచారణ జరిపి లోక్‌సభకు నివేదిక అందజేసింది. పార్లమెంట్‌ చర్చ చేపట్టి ఆఘమేఘాల మీద ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. అదేగాక చర్చలో ఆమె వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకపోవడం కూడా సరైన నిర్ణయం కాదు. ముఖ్యంగా పార్లమెంట్‌లో ప్రశ్నలన్నీ స్పీకర్‌ అంగీకారంతోనే అనుమతించబడతాయి. కారణం చెప్పకుండానే ఒక ప్రశ్నను తిరస్కరించే అధికారం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఫలానా ప్రశ్న అనుమతించబడిందంటే, దానిపై మరో మాట అక్కరలేదు. ఆమె వేసిన ప్రశ్నలు ఒక కంపెనీని టార్గెట్‌ చేసినట్టున్నా, పార్లమెంట్‌ గౌరవానికి కానీ, దేశ శ్రేయస్సుకు గానీ నష్టమేమీ లేదు. ఒకవేళ లంచం తీసుకుని ఆ పనికి పాల్పడ్డా అందుకామె సభ్యత్వం రద్దు చెయ్యడం మరీ పెద్ద శిక్ష. పైగా అలా రద్దు చెయ్యడం ద్వారా ఆమెతో పాటు, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాన్ని కూడా శిక్షించినట్టే భావించాలి. వారి గొంతు పార్లమెంట్‌లో విన్పించే అవకాశం దూరం చేసినట్టే కదా. డబ్బులు తీసుకుని ప్రశ్నలడగడం, ఒక కంపెనీ ప్రయోజనాల్ని వెనకేసుకు రావడం ఒక సభ్యుడు చెయ్యగల నేరం అయినప్పుడు అదే పని ఎన్నికల ఫండింగ్‌ తీసుకుని పెద్ద స్థాయిలో ఒక పార్టీ చేస్తేనో?! ప్రజాస్వామిక సమాజం ఆలోచించాల్సిన సీరియస్‌ విషయమిది.

– డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.

➡️