టిడిపి నేతల్లో టికెట్‌ టెన్షన్‌!

Mar 11,2024 10:30 #TDP

త్యాగాలు తప్పవంటున్న అధినేత
రెండో జాబితాపై ఆశలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నాయకుల్లో టెన్షన్‌ నెలకొంది. పొత్తులో భాగంగా తమకు టికెట్‌ దక్కుతుందా? లేదా? అనేది కొంతమందిలో ఉండగా, ఇంటిపోరులో నెగ్గి టికెట్‌ సాధించగలమా? అని మరికొంతమందిలో, కొత్తగా పార్టీలో చేరిన నేతలతో తమకు టికెట్‌ వస్తుందా? లేదా అనే ఆందోళనలో ఇంకొందరు నేతలు ఉన్నారు. టిడిపి-జనసేన ఉమ్మడిగా 99 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. ఇంకా 76 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ 76 చోట్ల ఎవరు? ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలను మిత్రపక్షాలైన జనసేన, బిజెపిలకు కేటాయించినట్లు సమాచారం. ఇందులో కేవలం 5 స్థానాలకు జనసేన తన అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 25 స్థానాల్లో తమ అభ్యర్థులను జనసేన-బిజెపి ప్రకటించాల్సి ఉంది. మిగతా 51 స్థానాల్లో టిడిపి తన అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. పెండింగ్‌లో ఉన్న స్థానాల్లో చంద్రబాబు ఐవిఆర్‌ఎస్‌ సర్వే ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లకు ఫోన్లు చేసి ఏ అభ్యర్థిని మీరు కోరుకుంటున్నారని అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త నేతల పేర్లు రావడంతో టికెట్‌ ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి కృష్ణాలో పెనమలూరుకు తొలి నుంచి బోడె ప్రసాద్‌ అభ్యర్థిగా సర్వే చేపట్టారు. మైలవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ టిడిపిలో చేరడంతో అక్కడ ఉన్న టిడిపి ఇన్‌ఛార్జి దేవినేని ఉమామహేశ్వరరావు పేరుతో పెనమలూరులో సర్వే చేపట్టారు. దీంతో ఇప్పుడు పెనమలూరు టికెట్‌ దేవినేనికా? బోడెకా? అనే ఉత్కంఠ నెలకొంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌తోపాటు అక్కడ టికెట్‌ ఆశిస్తున్న భాష్యం ప్రవీణ్‌ పేరుతో కూడా పార్టీ సర్వే చేపట్టింది. దీంతో ఇక్కడ ఎవరికిస్తారనే ఆందోళన నెలకొంది.
పొత్తుతో ముడిపడ్డ స్థానాలివే..!
రాష్ట్రవ్యాప్తంగా 33 స్థానాలు పొత్తుతో ముడిపడి ఉన్నట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో పలాస, పాలకొండ, విశాఖ ఉత్తరం, దక్షిణం, భీమిలి, యలమంచిలి, పెందుర్తి, మాడుగుల స్థానాలు పొత్తుతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పిఠాపురం, కాకినాడ అర్బన్‌, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్‌, అమలాపురం, పోలవరం, నరసాపురం, నిడదవోలు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం వంటి స్థానాల్లో జనసేన-బిజెపి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కైకలూరు, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరు పశ్చిమ, దర్శి స్థానాలు పొత్తులో ముడిపడి ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో శ్రీకాళహస్తి, మదనపల్లి, అనంతపురం, కదిరి, ధర్మవరం, రైల్వే కోడూరు, జమ్మలమడుగు స్థానాలు పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ నియోజకవర్గాల నుంచి సీటు ఆశిస్తున్న నేతలతో చంద్రబాబు ఇప్పటికే చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా సీటు ఎవరికి వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని చెప్పారు.
సీనియర్లకూ నిరీక్షణే
టిడిపిలో ఈసారి సీనియర్లకు టికెట్‌ కోసం నిరీక్షణ తప్పలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, ఆనం రామనారాయణ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, చింతమనేని ప్రభాకర్‌, బండారు సత్యనారాయణమూర్తి, యరపతనేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్‌ రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు.
వీరిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కళా వెంకట్రావుకు టికెట్‌ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కళా వెంకట్రావు ఎచ్చెర్ల సీటును ఆశిస్తున్నారు. అక్కడ అప్పలనాయుడుకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. కళాను విజయనగరం లోక్‌సభ నుంచి పోటీ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. సోమిరెడ్డి ఆశిస్తున్న సర్వేపల్లి టికెట్‌ను ఇటీవల టిడిపిలో చేరిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉంది.

➡️