తెలుగు రాష్ట్రాలకు వడగాల్పుల ముప్పు

Mar 2,2024 08:54 #Telugu states, #Threats
  • కర్ణాటక, తమిళనాడు, కేరళలోనూ ఉధృతి
  • ఈ నెల నుంచే అప్రమత్తంగా ఉండాలి : వాతావరణ శాఖ

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశమంతా మార్చి నెలలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు, వడగాడ్పుల బారిన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజరు మహాపాత్రో శుక్రవారం ఆన్‌లైన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం కనపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆ తరువాత రెండు మూడు రోజుల్లో తమిళనాడు, కర్నాటకలకు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కేరళలో ఇప్పటికే తీవ్ర ఉక్కపోత వాతావరణం నెలకొని ఉందని, ఇది కొనసాగుతుందని, వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మహారాష్ట్ర, ఒడిషాలలో కూడా వడగాల్పుల ప్రభావం ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే 40 సెల్సియస్‌ డిగ్రీలను దాటి ఉష్ణో గ్రత నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్చి నెల తరువాత ఎల్‌నినో ప్రభావం తగ్గడం కారణంగా వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు కూడా కొంత తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, వివిధ ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థలు మాత్రం మే నెలాఖరు వరకు వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నాయని అంచనా వేశారు.

రెండో అర్ధబాగంలో లా-నినా

మార్చిలోనే ఎల్‌-నినో పరిస్థితులు బలహీనమవుతాయని, సంవత్సరం రెండో అర్ధభాగంలో లా-నినా నెలకొంటుందని చెప్పారు. ఫలితంగా వర్షాలు బాగా కురియవచ్చనిమృత్యుంజరు మహాపాత్రో తెలిపారు.

➡️