ప్రతిపక్షాలను దెబ్బ తీసేందుకే ‘ఆ’ దాడులు 

Mar 30,2024 12:55 #editpage

దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు ‘తమకు లంగి గులాంగిరి చేయాలి, లేదంటే తీహార్‌ జైల్లో ఉండాలి’ అనేది బిజెపి రాచరికపు మనస్తత్వం. అందుకోసం గత పదేళ్ళ మోడీ పాలనలో ఇ.డి, ఐ.టి, సిబిఐ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేసేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత కూడా ప్రతిపక్షాలపై, ఆ పార్టీల నేతలపై ఈ వేధింపులు ఆగడంలేదు. గత వారం పది రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను, బిఆర్‌ఎస్‌ నేత కవితను జైలో పెట్టడం, కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై ఇ.డి రాత్రికి రాత్రి కేసు పెట్టడం, పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు, వారి బంధువుల ఇళ్లపై దాడులు కొనసాగించడం, కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు అకౌంట్లను స్తంభింపచేయడం వెనుక బిజెపి అధికార దాహం వుంది. అందుకు రాజ్యాంగబద్ధ సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నది. అవినీతి, అక్రమాలను అరికట్టి దేశానికి బాధ్యత వహించాల్సిన ఇ.డి, ఐ.టి, సిబిఐ సంస్థలు యజమాని ఆదేశాలను అమలు చేసే ప్రైవేట్‌ సంస్థలుగా మారిపోతూ, వాటి విశ్వనీయతను కోల్పోతున్నాయి.
ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ (పిఎంఎల్‌ఎ) చట్టాన్ని 2005, 2009, 2012లో అప్పటి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం సవరించింది. 1991 నుండి దేశంలో ప్రారంభమైన సరళీకరణ విధానాలు కొత్త తరహా అవినీతి, అక్రమాలకు దారితీశాయని వాటిని నిరోధించడానికి అవసరమైన చట్టబద్ధ ఏర్పాట్ల కోసం ఈ సవరణలు చేశారు. 2019కి ముందు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ దార్యాప్తు సంస్థలు ఎఫ్‌ఐఆర్‌ లేదా చార్జిషీట్లలో పిఎంఎల్‌ఏ సెక్షన్లు పెడితేనే ఇ.డి రంగంలోకి వచ్చి విచారణ జరిపేది. మోడీ ప్రభుత్వం 2019లో ఈ చట్టానికి చేసిన సవరణ వల్ల…ఇ.డి కి ఎవరు ఫిర్యాదు చేయకపోయినా, ఏ ఆధారాలు తనకు అందుబాటులో లేకపోయినా…నేరుగా ఇళ్ల మీద, ఆఫీసుల మీద దాడి చేసే అధికారాలను, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, అరెస్టులు చేసే అధికారాలను కట్టబెట్టింది. ఈ సవరణ వల్ల బిజెపి రెండు రకాలుగా లబ్ధి పొందింది. ఇ.డి ద్వారా దాడులు చేయించి ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలను లంగదీసుకోవడం లేదా ప్రజల్లో అప్రతిష్టపాలు చేసి జైల్లో పెట్టడం ద్వారా తన ప్రత్యర్థులను బలహీనులను చేయడం. కార్పొరేట్‌ కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయలను విరాళాలుగా స్వీకరించడం. ఇందు కోసం 2019 లోనే ఎన్నికల బాండ్ల విధానాన్ని తెచ్చింది.
2004ా2014 మధ్య కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఎ పాలన కాలంలో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ చట్టం (పిఎంఎల్‌ఎ) కింద 112 కేసులు నమోదు కాగా, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ పాలనలో పిఎంఎల్‌ఎ చట్టం కింద 5,906 కేసులు, ఫారిన్‌ ఎక్స్చెేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా) కింద 12,233 కేసులు నమోదయ్యాయి. గడచిన ఒక్క సంవత్సరంలోనే 1,180 కేసులను ఇ.డి పెట్టింది. ఇది ఇ.డి చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు. ఇ.డి కేసులు ఇంతగా పెరగడానికి రెండు కారణాలు వుండాలి. ఒకటి-మోడీ పాలనా కాలంలో అవినీతి, అక్రమాలు భారీగా పెరగడం వల్ల ఈ కేసుల సంఖ్య పెరిగి వుండాలి. రెండు-రాజకీయ ఆధిపత్యం కోసం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై తప్పుడు కేసులు పెట్టి వుండాలి. తమ పాలనలో అవినీతిని అంతం చేశామంటున్న మోడీ ఆయన వందిమాగదులు తమ పాలనా కాలంలో అవినీతి పెరిగిందనడాన్ని అంగీకరించరు. అలాంటప్పుడు రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇ.డి, ఐ.టి, సిబిఐ సోదాలు, దాడులు జరిగాయనేది నిజం. మోడీ పాలనలో ఇప్పటి వరకు నమోదైన 5,906 కేసుల్లో నేరం రుజువైంది కేవలం 25 కేసుల్లోనే. అంటే నేర నిర్ధారణ జరిగిన కేసులు 0.42 శాతం మాత్రమే! ఇ.డి ఇన్ని వేల కేసులు ఎందుకు పెట్టింది? ఆర్థిక నేరాలను అరికట్టడానికా? బిజెపి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడానికా? 2014 నుండి 2022 మధ్య 115 మంది రాజకీయ నేతలపై కేసులు నమోదు కాగా, అందులో 95 శాతం మంది ప్రతిపక్ష పార్టీల నేతలేనని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక ఇటీవల వివరాలు ప్రకటించింది. 2023లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి గెలవడం వెనుక ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలపై ఇ.డి చేసిన దాడుల ప్రభావం వుందనేది జగద్వితం.
త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరల ఇ.డి దాడులు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నెలలో 19 చోట్ల దాడులు జరిగాయి. జనవరి 29న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఇంటిపై సోదాలు చేసి ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 2021 ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో గత వారం ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, బిఆర్‌ఎస్‌ నేత కె. కవితలను జైల్లో పెట్టారు. సిబిఐ గతంలో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై నమోదు చేసిన పాత కేసులో ఆయనను, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌, ఇద్దరు కుమార్తెలపై ఇ.డి విచారణ ప్రారంభించింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజరు సింగ్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ నెలలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, కేరళ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఇ.డి జరిపిన దాడులు ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. ‘ఇండియా’ వేదిక ఏర్పాటులో కీలకంగా వున్న బీహార్‌ ముఖ్యమంత్రి రాత్రికి రాత్రి ఫిరాయించి బిజెపి పంచన చేరడం వెనుక ఇ.డి భయం వుందనే వార్తలు వచ్చాయి.
విచిత్రమేమంటే బిజెపి యేతర పార్టీల్లో వున్నప్పుడు ఇ.డి, సిబిఐ దాడులు ఎదుర్కొన్న రాజకీయ నాయకులు బిజెపిలో చేరిన వెంటనే విచారణలు ఆగిపోవడమే కాక, పదవులు దక్కడం మోడీ మ్యాజిక్‌. భావన గవాలి, ప్రతాప్‌ సర్నాయక్‌, హసన్‌ ముష్రిఫ్‌, అజిత్‌ పవార్‌, యామినీ జాదవ్‌, ఛగన్‌ భుజబల్‌, అశోక్‌ చౌహన్‌…ఇలా ఎంతోమంది ఇ.డి నేరారోపణలు ఎదుర్కొని బిజెపిలో చేరిపోయి ఉన్నత స్థానాల్లో అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఉదాహరణకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఈయన మొదట కాంగ్రెసు నాయకుడు. ఒకనాడు అస్సాం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖా మంత్రి. శారదా చిట్‌ఫండ్‌ కేసులో ఈయన పేరు వినిపించింది. గౌహతిలో ఈయన భార్య నిర్వహిస్తున్న న్యూస్‌ లైవ్‌ కార్యాలయంపై 2014 ఆగస్టులో సిబిఐ దాడులు చేసింది. అదే సంవత్సరం నవంబర్‌లో సిబిఐ హిమంత శర్మను విచారించింది. 2015 జనవరిలో చిట్‌ఫండ్‌ కేసును గౌహతి హైకోర్టు సిబిఐకి అప్పగించింది. ఆ వెంటనే హిమంత శర్మ బిజెపిలో చేరిపోయారు. అప్పటి నుండి సిబిఐ ఆయన దరిదాపులకు వెళ్లకపోగా అస్సాం ముఖ్యమంత్రిగా అధికారాన్ని చెలాయిస్తున్నారు. మహారాష్ట్రలో అజిత్‌ పవార్‌ ఉదంతం అలాంటిదే. ఈయన ఎన్‌సిపి వ్యవస్థాపకుడు, శరద్‌ పవార్‌కు మేనల్లుడు. ఆ పార్టీకి జాతీయ నాయకుడు. అజిత్‌ పవార్‌పై అనేక కేసులున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఇచ్చిన రుణాలలో అక్రమాల కేసును 2019లో మహారాష్ట్రలో ‘మహా వికాస్‌ అఘాడి’ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇ.డి తిరగదోడింది. అప్పటికి అజిత్‌ పవార్‌ కాంగ్రెసు- ఎన్‌సిపి ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా వున్నారు. ఇ.డి విచారణ చేపట్టిన వెంటనే ఎన్‌సిపి పార్టీని చీల్చి బిజెపిలో చేరి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మరుసటి రోజే బాంబే హైకోర్టు ముందు ఎసిబి అతనికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. మహారాష్ట్ర శివసేన ఎంపీ భావన గవాలి చైర్మెన్‌గా వున్న పబ్లిక్‌ ట్రస్టు ఏడు కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఇ.డి ఆరోపించింది. ఆమె సన్నిహితుడు సయీద్‌ ఖాన్‌ను అరెస్టు చేసింది. భావన గవాలి ఏకనాథ్‌ షిండే నాయకత్వంలోని శివసేన వర్గంలో చేరడంతో కేసు మూతపడడమే కాక శివసేన చీలిక వర్గానికి పార్లమెంట్‌ చీఫ్‌ విప్‌గా ఎన్నికయ్యారు. గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నాయకుడు దిగంబర్‌ కామత్‌ అవినీతి కేసులో విచారణ ఎదుర్కొన్నారు. 14 సూట్‌కేస్‌ (షెల్‌) కంపెనీలు పెట్టి రాజకీయ నాయకులకు కోట్లాది రూపాయలు లంచాలు ఇచ్చినట్లు ఇ.డి కేసు నమోదు చేసింది. ఆయన వెంటనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తీసుకుని బిజెపిలో చేరారు. విచారణ ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి 2017లో నారద చిట్‌ఫండ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇ.డి విచారణ చేపట్టింది. 2020లో బిజెపిలో చేరారు. 2021 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై బిజెపి తరపున పోటీ చేసి గెలిచి ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు.
తెలంగాణలో ఈటెల రాజేందర్‌ బిఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడు. భూ కుంభకోణం కేసులో విచారణ, బిజెపిలో చేరడం, ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా వున్న సి.ఎం.రమేష్‌, సుజనా చౌదరిపై బ్యాంకు కుంభకోణాల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం కోల్పోయిన వెంటనే బిజెపిలో చేరారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా బిజెపి తరపున పోటీ చేస్తున్నారు. ఇ.డి దాడులు రాజకీయంగానే గాక, ఆర్థికంగానూ బిజెపిని బలపడేలా చేశాయి. ఎన్నికల బాండ్ల పేరుతో బిజెపి ఖాతాలోకి వేల కోట్ల రూపాయలు వచ్చిచేరాయని వెలుగులోకి వచ్చింది.
ఇన్ని అక్రమ, అవినీతి పద్ధతులకు పాల్పడుతున్న బిజెపికి నీతి, ధర్మం, విలువల గురించి మాట్లాడే అర్హత వుందా? ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల ప్రజల్లో ముఖ్యంగా యువతలో భ్రష్టుపట్టించాలనే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇన్ని రకాల అక్రమ పద్ధతులకు బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్పడుతున్నాయి. వారు కోరుకునే మను ధర్మ రాజరిక పాలన ప్రజామోదం పొందాలంటే ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థను భ్రష్టు పట్టించడం వారికి అవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే పుట్టినిల్లు అని చెప్పుకునే పెట్టుబడిదారీ వర్గం కూడా ఇందుకు తోడ్పడుతోంది. వారి దోపిడి వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దానివల్ల ఉత్పత్తిలో వచ్చిన సంక్షోభం నుండి బయటపడడానికి అప్పటికే ప్రజలు సృష్టించిన సంపదను కాజేయడం, ప్రకృతి వనరులను దోచేయడం చేయాలి. అందుకు రాజకీయ అధికారం తోడ్పాటు కావాలి. మతం చాటున తమ దోపిడికి మతం చాటుకావాలి. అందుకే ప్రపంచమంతా ఈ మితవాద, మతవాద పార్టీలకు ఈ వర్గం అండగా వుండి అధికారాన్ని చేజిక్కించుకునేలా చేస్తున్నాయి. కార్పొరేట్‌ శక్తులు ఎన్నడూ లేనంతగా మన దేశంలో బలపడడానికి, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరగడానికి ఈ బంధమే కారణం. అవినీతి, అక్రమాలను, మత రాజకీయాలను, కార్పొరేట్‌ దోపిడిని అడ్డుకోవాలన్నా, కొన ఊపిరితో వున్న ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలన్నా బిజెపిని గద్దె దించాల్సిందే.

– వి. రాంభూపాల్‌

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /

➡️