బిజెపికి మూడవ స్థానమే…!

Apr 9,2024 03:39
  • ఒక్క సీటూ కష్టమే
  • కేంద్ర పెద్దలకు ఇంటెలిజెన్సీ నివేదిక

ప్రజాశక్తి – చెన్నై బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కమలం కూటమికి మూడో స్థానం దక్కనుందని పలుచోట్ల ఆ కూటమికి ఓటమి తప్పదని కేంద్ర నిఘా వర్గాల పరిశీలనలో తేలింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఢిల్లీ బిజెపి పెద్దలు నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బిజెపి బలం పెరిగిందనే ధీమాతో రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై ఉన్నారు. బిజెపి కూటమిలో పిఎంకె. తమిళమానిల కాంగ్రెస్‌, అమ్మ మక్కల్‌ మున్నెట్ర కళగం వంటి పార్టీలతో పాటు కొన్ని చిన్న పార్టీలు కూడా చేరాయి. ఇందులో పిఎంకె 10, తమిళ మానిల కాంగ్రెస్‌ మూడు, అమ్మ మక్కల్‌ మున్నెట్ర కళగం రెండు చోట్ల పోటీ చేస్తున్నాయి. ఏసీ షణ్ముగం – పుదియనీడికట్చి, పారివేందర్‌ – ఐ జెకే, జాన్‌ పాండియన్‌ – తమిళ మక్కల్‌ మున్నెట్రా కళగం, దేవానాచాన్‌ – ఇండియన్‌ మక్కల్‌ కల్వి మున్నెట్ర కళగం నేతలు సైతం బిజెపి కూటమిలో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. బిజెపి అభ్యర్థులు 24 మంది లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపు అవకాశాలు, నియోజకవర్గ పరిస్థితుల గురించి ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా ఢిల్లీలోని బిజెపి వర్గాలు ఆరా తీశాయి. ఇందుకు సంబంధించిన నివేదిక ఢిల్లీకి తెప్పించుకున్నారు. ఈ ఎన్నికల్లో కనీసం ఐదు స్థానాలు సాధించి డిఎంకె తర్వాత తమిళనాడు రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవాలని కమలం నేతలు చూస్తున్నారు. ఇదే సమయంలో అన్నాడీఎంకెని తొక్కేసి ఆ స్థానం కైవసం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. అయితే ఇవన్నీ ఫలించే అవకాశాలు లేవని ఇంటెలిజెన్స్‌ చెబుతోంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నా డీఎంకే మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. బిజెపి మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఇంటెలిజెన్స్‌ నివేదిక తేల్చింది. కొన్నిచోట్ల బిజెపికి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రాజకీయ నాయకుల విశ్లేషణ. ఏది ఏమైనప్పటికీ తమిళనాడులో బిజెపి బలం పెంచుకోలేదని అర్థమవుతోంది. దక్షిణ చెన్నై లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళ సై సౌందర్‌ రాజన్‌ ఓటమి తప్పదని సర్వేలు తెలుపుతున్నాయి.

➡️