ఆదివాసీ ఆలోచన చేయండి-ఓటుతో ద్రోహులకు గుణపాఠం చెప్పండి : సీతాగుంట పంచాయతీ సర్పంచ్‌

Feb 24,2024 14:12 #Adivasi, #Panchayat Sarpanch, #votes

పెదబయలు (అల్లూరు) : అరకు పాడేరు అసెంబ్లీ నియోజకాల్లో ఆదివాసీ గిరిజనులు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో గిరిజన ద్రోహులకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని ప్రతిఒక్కరికి ఆదివాసీ ఆలోచన చేయాలని సీతాగుంట పంచాయతీ సర్పరచ్‌ పలాసి మాధవరావు ప్రజాశక్తి తో శనివారం అన్నారు.

పంచాయతీ సర్పంచ్‌ మాట్లాడుతూ … ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ప్రజలకు అందుబాటులో ఉండే నేతను, గిరిజన చట్టాలు హక్కులు కాపాడేవారు, అసెంబ్లీలో గళం విప్పే నాయకుడినే ఓటుతో ఎన్నుకోవాలన్నారు. విద్యావంతులు అవినీతికి దూరంగా ఉండాలన్నారు. పార్టీ చరిత్రను పరిగణనలోకి తీసుకోకూడదని చెప్పారు. అభ్యర్థిని బట్టి ఓటేయాలన్నారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడే పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థులు బరిలో ఉంటే పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. జి ఓ నంబర్‌ 3 కోసం అధికారంలో ప్రతి పక్షంలో ఉన్న గిరిజన ద్రోహులు ఏనాడు నోరు విప్పలేదని చెప్పారు. గిరిజన నేతలుగా చెప్పుకునే నేతలు, పార్టీలకు తగ్గి ప్రజలకు మోసపురితమైన ప్రకటనలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ హక్కులకు భంగం కలిగించే పార్టీలకు తొత్తులుగా మారవద్దని హితవు పలికారు. ఉద్యోగులు విద్యార్థి ప్రజాసంఘాలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. జి ఓ నంబర్‌ 3 తొలగించటంతో నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా అధికారంలో ఉన్న నాయకులు నోరు విప్పకపోవడం ఓటర్లు గమనించాలన్నారు. 1/70 చట్టం ఉన్నప్పటికీ స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఒక్కొక్కరు రెండు నుండి మూడేసి షాప్స్‌ అక్రమ నిర్మాణాలు యద్దేచ్చగా జరుగుతున్నప్పటికీ రెవిన్యూ అధికారులు గమ్ముగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో అడవిని నమ్ముకొన్న గిరిజనుడికి అడవే ఆధారం అని అన్నారు. ఆదివాసీ గిరిజనులంతా పోరాటాల ద్వారానే హక్కులు చట్టాలు కాపాడుకోవాలన్నారు. ఓటు వేసే ముందు ఓటరు అన్నిటినీ గమనించాలని పంచాయతీ సర్పంచ్‌ కోరారు.

➡️