మా మధ్య భేదాభిప్రాయాలు లేవు

  • ముంబయి నూతన సారథి హార్దిక్‌ పాండ్యా

ముంబయి: మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ముంబయి ఇండియన్‌ నూతన సారథి హార్ధిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హార్ధిక్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. హెడ్‌కోచ్‌ మార్క్‌ బౌచర్‌తో కలిసి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పాండ్యా మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ మార్పుతో భిన్నంగా ఏమీ ఉండదు. రోహిత్‌ నాకు సాయం చేసేందుకు నిత్యం నాకు మద్దతుగా ఉంటాడు. నాకు అవసరమైనప్పుడల్లా నా భుజం తడతాడు. నేను నా కెరీర్‌ను అతడి హయాంలోనే అరంగేట్రం చేయడమే గాక రాబోయే టి20 వరల్డ్‌ కప్‌లో కూడా అతడి సారథ్యంలోనే ఆడాల్సి ఉంటుంది..’ అని చెప్పాడు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్‌ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై హార్ధిక్‌ మాట్లాడుతూ… ‘కెప్టెన్‌ను మార్చిన తర్వాత కొంతమంది అభిమానులు అసహనంతో ఉన్నారన్న విషయం నా దష్టికీ వచ్చింది. నేను వారి భావోద్వేగాల్ని గౌరవిస్తాను. కానీ నేను నియంత్రించగలిగేది మాత్రమే నియంత్రిస్తా. నా చేతుల్లో లేనిదానిని నేను ఏమీ చేయలేను. నేను పూర్తిగా ఆటమీదే దష్టి సారిస్తా..’ అని తెలిపాడు. ఇంతవరకూ రోహిత్‌ శర్మతో మాట్లాడలేదని, గత కొంతకాలంగా రోహిత్‌ ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో నిమగమై ఉన్నాడని, అందుకే అతడితో మాట్లాడే వీలు దొరకలేదని అన్నాడు. అలాగే ఇటీవల కాలంలో మేమిద్దరం ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే అవకాశం కూడా రాలేదని, త్వరలోనే అతడు ముంబయి క్యాంప్‌లో జాయిన్‌ అవుతాడు. అప్పుడు రోహిత్‌తో మాట్లాడతా..’ అని అన్నాడు. తాను కెప్టెన్‌ అయినప్పటికీ రోహిత్‌ తనకు ఎప్పుడూ అండగా ఉంటాడని, రాబోయే టి20 ప్రపంచకప్‌లో అతడి సారథ్యంలోనే తాను భారత జట్టుకు ఆడాల్సి ఉందని పాండ్యా చెప్పాడు. కాగా ఐపిఎల్‌ 17వ ఎడిషన్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించి.. ఐదుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మపై వేటు వేసింది.
మొరాయించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌…
ఐపిఎల్‌ 17వ సీజన్‌ తొలి ఆరంభమ్యాచ్‌ టికెట్లకోసం అభిమానులు పోటెత్తారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుల మధ్య జరిగే ఆరంభ మ్యాచ్‌ టికెట్లను బిసిసిఐ సోమవారం ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ఉదయం 9్ణ30 గంటలకు పేటిఎమ్‌ ఇన్‌సైడర్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాగా.. సర్వర్‌ మోరాయించి టికెట్ల అమ్మకాలు నిలిచిపోయాయి. ఊహించని పరిణామంతో షాక్‌ తిన్న సీఎస్కే-ఆర్సీబీ ఫ్యాన్స్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తూ పేటిఎమ్‌ ఇన్‌సైడర్‌ ప్రకటన విడుదల చేసింది. టికెట్ల సేల్‌ గురించి త్వరలోనే అప్‌డేట్‌ ఇస్తామని పేర్కొంది. అలాగే టికెట్‌ పొందినవారికి ప్రింట్‌ అవుట్‌ అవసరం లేదని, ఫోన్‌లో ఈ-టికెట్లను చూపించినా సరిపోతుందని చెపాక్‌ స్టేడియం నిర్వాహకులు తెలిపారు. పదిహేడో సీజన్‌ తొలి మ్యాచ్‌ మార్చి 22న చిదంబరం స్టేడియంలో జరగనుంది.

➡️