కాశ్మీరీ తివాచీ నేతగాళ్ల వెతల కత!

Apr 8,2024 04:22 #Jeevana Stories

అందమైన ప్రకృతి దృశ్యాలకు నెలవైన జమ్ము కాశ్మీర్‌ ఇప్పుడు అస్తవ్యస్త పరిస్థితులతో సతమతమవుతోంది. మంచు దుప్పటి కప్పుకున్న పర్వత శ్రేణులు, దాల్‌ సరస్సు అందాలు, కాశ్మీరీ తివాచీలు వేటికవే ప్రత్యేకమైనవి. ఒకపక్క వాతావరణ కాలుష్యానికి ప్రకృతి అందాలు అంతరించిపోతున్నాయి. మరోపక్క ఉపాధి మార్గం లేక వృత్తి విద్యను వదిలి పెట్టి రోజు కూలీకి తరలిపోతున్నారు ఎందరో తివాచీ నేతదారులు. చేతినిండా డబ్బు, రోజంతా పనితో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడిపిన వారంతా రోజు కూలీ కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
అల్తాఫ్‌ అహ్మద్‌ దార్‌ (37), అన్నం క్యారేజీ బ్యాగులో పెట్టుకుని బుద్గం జిల్లా ముఖమ్‌ నుంచి వత్రహైల్‌కి ఉదయమే బయలుదేరాడు. అప్పుడు సమయం 7.30 గంటలు. ఆ టైంకి అక్కడ ఉంటేనే 9 గంటలకల్లా హైదర్‌పొరా చౌక్‌కి చేరుకుంటాడు. అక్కడ దార్‌ లాగే ఎందరో కళాకారులు, చేతివృత్తిదారులు ఉపాధి కోసం బారులు తీరి ఉంటారు. ఊళ్లో ఉదయం బయలుదేరే బస్సులో ఇక్కడికి చేరుకోవడం, దొరికిన పని చేసుకుని సాయంత్రం అదే బస్సులో తిరుగు ప్రయాణమవ్వడం వారి దినచర్యలా మారిపోయింది.
ఒకప్పుడు కాశ్మీరీ తివాచీల కోసం యాత్రికులు, పర్యాటకులు దార్‌ ఇంటి ముందు గుమిగూడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోగా, పూట గడవడం కష్టమై దార్‌ పనిబాట పట్టాడు. పదుల సంఖ్యలో కాదు, వందలమంది ఉపాధి కోసం శ్రీనగర్‌కి ప్రతిరోజూ ప్రయాణాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
15 ఏళ్లుగా బస్సు కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మజీద్‌ అహ్మద్‌ ఖాన్‌ (40) ఈ ప్రయాణాల గురించి ఇలా చెబుతున్నారు. ‘పదేళ్ల క్రితం మేము ఇలా బుద్గామ్‌ గ్రామాల నుంచి శ్రీనగర్‌కి ప్రతి రోజూ బస్సు సర్వీసులు నడపలేదు’ అని గతాన్ని గుర్తు చేసుకున్న మజీద్‌ ఒకప్పుడు తివాచీ నేయడంలో చేయి తిరిగిన కళాకారుడు. రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ, కండెక్టర్‌గా ఇప్పుడు నెల మొత్తం మీద రూ.8000 వేతనమే అందుతోంది.
బస్సులో ప్రయాణించే మొత్తం ప్రయాణీకుల్లో 90 శాతం మంది ఉపాధి కోసం వెళ్లేవారే. బుద్గామ్‌లోని రాయర్‌, ఖాన్‌ సాహిబ్‌, యార్ఖా, వత్రాహైల్‌, బోనిట్‌, హుఖ్‌లత్రి, దానాస్‌ మీదుగా కార్మికులను హైదర్‌పోరాకి చేర్చడం, మళ్లీ సాయంత్రం 6 గంటలకు వారి వారి గ్రామాల్లో ఇంటికి చేర్చే పనిలో బస్సు సర్వీసులు ఉంటున్నాయి. ‘ఆ రాత్రంతా అక్కడే ఉండి, ఉదయం పని వేళకి మళ్లీ కార్మికులను హైదర్‌పోరాకి చేరవేయడం మా దినచర్యగా ఉంటుంది’ అని మజీద్‌ చెబుతున్నప్పుడు అతని మాటల్లో ఎంతో ఆవేదన కనిపిస్తోంది.
ఇలా కుదేలయ్యారు …
హుఖలత్రి గ్రామంలో 2005లో తివాచీ నేసే కళాకారులు వందమంది వరకు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య పదుల సంఖ్యకు చేరుకుంది. గులామ్‌ నబి భట్‌ (55). హుఖలత్రి గ్రామంలో తివాచీ నేత కార్మికుడు. ‘నేత నేసే కాలంలో అంటే దశాబ్దం క్రితం నేను ఇంటి నుండే రోజుకు రూ.700 సంపాదించేవాడ్ని. కానీ, ఇప్పుడు శ్రీనగర్‌ వెళ్లి పారిశుధ్య రంగ కార్మికుడిగా పనిచేస్తున్నాను. బస్సు ఛార్జీలు పోను, రోజుకు రూ.500 రావడం కూడా కష్టమే’ అంటున్నాడు. గులామ్‌ వయసు రీత్యా పెద్దవాడు. ఆయన తప్ప ఆ ఇంటిలో సంపాదించే వారు లేరు. ఈ పరిస్థితుల్లో అతనికి ఎంతో కొంత ఆదాయం కావాలి. అందుకే శరీరం సహకరించక పోయినా ఇష్టం లేని పనిలో రోజంతా పని చేస్తున్నాడు.
ఫరూఖ్‌ అహ్మద్‌ దార్‌ (38), బషీర్‌ అహ్మద్‌ దార్‌ (44) అన్నదమ్ములు. 15 ఏళ్ల వయసు నుండీ తివాచీ పనిలో ఉన్నారు. రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదించేవారు. క్రమంగా ఆదాయం పడిపోవడంతో అన్నదమ్ములిద్దరూ శ్రీనగర్‌లో కూలి చేసుకుంటున్నారు.
బుద్గామ్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఆ జిల్లాకే పరిమితం కాదు. ఆదరించేవారు లేక, కుటుంబాలు గడవక దేశంలో ఎందరో కళాకారులు ఉపాధి బాట పట్టారు. అలివిగాని పనుల్లో, అనువుగాని ప్రదేశాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. హుందా జీవితం గడిపిన, గౌరవంగా బతికిన ఎంతోమంది తమ ఉనికిని, నైపుణ్యాన్ని కనిపించనీయకుండా చెప్పిన పని చేసుకుంటూ చేతులు బబ్బలెక్కేలా పనులు చేస్తున్నారు. కళాకారులను గౌరవించడమంటే వారికి తృణమో, పణమో ఇవ్వడం కాదు.. వారి కళను గుర్తించి ప్రోత్సహించడమని ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఈ పరిస్థితి ఇంకెంత కాలమో..!

➡️