అధికారంలోకొస్తే పింఛను పెంపు

Feb 6,2024 07:47 #Nara Chandrababu, #TDP
  • ప్రజలు బటన్‌ నొక్కి వైసిపిని ఆలౌట్‌ చేయాలి
  • వాటి కోసం సిఎం ఎందుకు బటన్‌ నొక్క లేదు
  • సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని గాడిలో పెడతాం
  • పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
  • ‘రా… కదలిరా’ సభల్లో చంద్రబాబు

ప్రజాశక్తి- అనకాపల్లి, ఏలూరు ప్రతినిధులు : టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ఇచ్చే సామాజిక పింఛన్‌ను పెంచుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బటన్‌ నొక్కి వైసిపిని ఆలౌట్‌ చేయాలని, పులివెందులతో సహా 175 స్థానాల్లోనూ టిడిపి-జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. బటన్‌ నొక్కుడు కాదు… నీ బొక్కుడు సంగతేంటని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బటన్‌ నొక్కి జగన్‌ను జైలుకు పంపిస్తారని ఎద్దేవా చేశారు. వైసిపిని చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రానికి మోక్షం కలుగుతుందన్నారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గొండుపాలెం, ఏలూరు జిల్లా చింతలపూడిలో సోమవారం జరిగిన ‘రా… కదలిరా’ బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. బటన్‌ నొక్కుతున్నానని ముఖ్యమంత్రి గొప్పగా చెప్తున్నారని, నొక్కుడు కాదు… బొక్కుడు సంగతేమిటని ప్రశ్నించారు. ప్రజలకు రూ.పది ఇచ్చి రూ.వంద దోచుకున్నారని విమర్శించారు. తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచి రూ.64 వేల కోట్ల భారం మోపారని, రూ.60 మద్యం సీసాను రూ.200 చేశారని, ఆర్‌టిసి ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచారని, చెత్త పన్ను విధించారని, ప్రజల బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారని దుయ్యబట్టారు. ప్రతి ఇంటిపైనా గత ఐదేళ్లలో రూ.8 లక్షల వరకూ అదనపు భారం మోపారని విమర్శించారు. ముఖ్యమంత్రి వేసిన సొమ్ము ఐదేళ్లలో ఎంతుందో అందరికీ తెలిసిందేనన్నారు. జాబ్‌ కేలండర్‌, మద్య నిషేధం, సిపిఎస్‌ రద్దుకు, రైతుల ఆత్మహత్యల నివారణకు, గుంతులుపడిన రోడ్డను బాగు చేసేందుకు ఎందుకు బటన్‌ నొక్కలేదని ప్రశ్నించారు. నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయినా సిఎంకు పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రోజుకు నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. రైతులను ఆదుకొనే చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడమే ఇందుకు కారణమని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలోని పరిశ్రమలను తరిమేసిందని, విశాఖను క్రైం, గంజాయి క్యాపిటల్‌గా మార్చిందని విమర్శించారు. ముఖ్యమంత్రి తన సలహాదారులకు, సాక్షి పత్రికకు, రుషికొండ ప్యాలస్‌కు రూ.2,200 కోట్లు ఖర్చు పెట్టారని, ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధినీ పరుగులు పెట్టిస్తానన్నారు. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, పామాయిల్‌కు ప్రోత్సాహకాలు, ఆక్వాకు రూపాయిన్నరకే విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. వైసిపి ఫ్యాన్‌ మూడు రెక్కలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు చిత్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

హెలిప్యాడ్‌ వద్ద కలకలం

చింతలపూడిలో చంద్రబాబు సభ ప్రారంభానికి ముందు హెలిప్యాడ్‌ వద్ద కొద్దిసేపు కలకలం నెలకొంది. చంద్రబాబు హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యే ప్రాంతంలో బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టగా బజర్‌ మోగింది. దీంతో, అప్రమత్తమై అక్కడ తవ్వగా చిన్నపాటి ఇనుప ముక్క బయటపడింది. దీంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు.

➡️