తూర్పు నౌకాదళం మరింత బలోపేతం

Dec 4,2023 07:57 #Navy, #visakhapatnam
  • రూ.2196 కోట్లతో 37 నేవల్‌ ప్రాజెక్టులు
  • వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అధునాతన యుద్ధ విమానాలు, నేవల్‌ బేస్‌ల నిర్మాణంతో తూర్పు నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామని తూర్పు నౌకాదళం వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ వెల్లడించారు. విశాఖలోని ఇఎన్‌సి ఆఫీసర్స్‌ మెస్‌లో నౌకాదళ ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఆదివారం మీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్‌ పెంధార్కర్‌ మాట్లాడుతూ తూర్పు నౌకాదళం బలోపేతానికి 37 ప్రాజెక్టులను రూ.2192 కోట్లతో చేపడుతున్నామని ప్రకటించారు. నావికాదళ శక్తి సామర్థ్యాలను నేవల్‌ బేస్‌ నిర్మాణం ద్వారా ఇనుమడింపజేస్తున్నామని తెలిపారు. ఈ నెల 10న నేవీ డే ఆపరేషనల్‌ డెమానిస్ట్రేషన్స్‌ ఆర్‌కె.బీచ్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిపారు. మిలాన్‌-2024 విన్యాసాలకు తూర్పు నౌకాదళం వేదిక అవుతోందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి వారం రోజులపాటు ఈ విన్యాసాలు జరుగుతాయని అన్నారు. ప్రపంచంలోని 50 దేశాలు పాల్గొంటాయని, చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. మిలాన్‌ విన్యాసాలతో మొట్టమొదటసారిగా ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, విక్రాంత్‌ వంటి ఎయిర్‌ క్రాఫ్ట్‌ కేరియర్‌లు నౌకాదళంలో అడుగుపెడతాయని తెలిపారు. ప్రస్తుతం తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 37 వేల మంది సిబ్బందితో తూర్పు నౌకాదళం బలంగా ఉందన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద ఎన్‌ఎఒబి నేవల్‌ బేస్‌ పనులపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

➡️