కాంగ్రెస్‌ ‘మేనిఫెస్టో’ ప్రజలకు ప్రగతిశీల పత్రం

Apr 11,2024 22:53

సమావేశంలో మాట్లాడుతున్న మనోజ్‌ చౌహాన్‌

ప్రజాశక్తి-అమలాపురం

కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ప్రజలందరికీ న్యాయాన్ని అందించే ప్రగతిశీల పత్రమనిఎఐసిసి పరిశీలకులు మనోజ్‌ చౌహన్‌ అన్నారు. గురువారం అమలాపురం పట్టణంలోని హోటల్‌ సామ్రాట్‌ ఫంక్షన్‌ హాల్లో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కొనసీమ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సమావేశం జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్‌ రావు అధ్యక్షతన జరిగింది. మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత జరిగిన సమావేశంలో మనోజ్‌ చౌహాన్‌ మాట్లాడారు. సమాజాన్ని మతపరంగా విభజిస్తూ విద్వేషాలు సృష్టిస్తున్న బిజెపిని ఓడించకపోతే దేశానికి ప్రమాదం వస్తుందన్నారు. దేశంలోని విభిన్న జాతులను మతాలను, ప్రాంతాలను ఐక్యంగా కలిపి ఉంచే శక్తి జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉన్నదని చౌహాన్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన ఐదు గ్యారంటీలను, రాష్ట్రస్థాయిలో ప్రకటించిన 9 గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్తే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రేమతో సమాజాన్ని ఐక్యం చేసే లక్ష్యంతో సాగిందని వివరించారు. భారత్‌ జోడో న్యాయ యాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షలను మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ అయిదు గ్యారంటీల రూపంలో పొందు పరిచిందని అన్నారు. మరొక ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ పార్లమెంట్‌ పరిధిలోని ఆరు అసెంబ్లీలకు పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిందని, ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకి ఏమి మేలు చేయనున్నదో వివరించి పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌, ముమ్మిడివరం అభ్యర్థి పాలెపు ధర్మారావు, కొత్తపేట అభ్యర్థి రౌతు ఈశ్వరరావు, రామచంద్రపురం అభ్యర్థి కోట శ్రీనివాసరావు, రాజోలు అభ్యర్థి సరెల్ల ప్రసన్నకుమార్‌, అమలాపురం అభ్యర్థి అయితా బత్తుల సుభాషిని, మండపేట అభ్యర్థి కామన ప్రభాకర్‌ రావుల తో పాటు ఎపిసిసి ఉపాధ్యక్షులు కొత్తూరు శ్రీనివాసరావు, ముసిణి రామకృష్ణారావు, ఎఐసిసి సభ్యులు చీకట్ల అబ్బాయి, యార్లగడ్డ రవీంద్ర, పిసిసి ప్రధాన కార్యదర్శి మాచవరం శివన్నారాయణ, తదితరులతో పాటు జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, పలు అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

 

➡️