ఆ నమ్మకం నిజం కాదు

Apr 6,2024 06:05 #feachers, #jeevana

రోజూ స్కూలుకి చాలా హుషారుగా వచ్చే రాము, ఓ రోజు చాలా దిగాలుగా వచ్చాడు. రాముని చూసిన మాస్టారు తనని దగ్గరకి పిలిచి, ”ఏంట్రా రామూ, చాలా విచారంగా కనిపిస్తున్నావు. ఏమైంది?” అని అడిగారు.
”సార్‌! నా పైపెదవి కొద్దిగా చీలి ఉంటుంది కదా. దానిని చూసి అందరూ నవ్వుతున్నారు. నాకు బడికి కూడా రాబుద్ధి కావడం లేదు. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ గ్రహణం చూసిందంట. అందుకే నా పెదవి ఇలా అయిందని మా నానమ్మ చెబుతుంది సర్‌” అని ఏడుస్తూ చెప్పాడు.
”రామూ… ఇలా చూడు. గ్రహణం చూడటానికి, నీ పెదవి అలా ఉండడానికి ఏం సంబంధమూ లేదు. గర్భిణీలు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల లేదా ఏదైనా జన్యుపరమైన కారణాల వల్ల ఇలా రావొచ్చని నేను పుస్తకాల్లో చదివాను. దీన్ని గ్రహణం మొర్రి అని పిలుస్తారే కానీ, గ్రహణానికి, దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆపరేషన్‌ ద్వారా ఈ లోపాన్ని సరి చేయవచ్చు. నువ్వు అధైర్య పడవద్దు. మీ అమ్మా, నాన్నను రేపు బడికి తీసుకొని రా. నాకు తెలిసిన డాక్టర్‌తో నీ సమస్య గురించి మాట్లాడతా. అలాగే నిన్ను చూసి హేళన చేయవద్దని స్కూలు పిల్లలతో కూడా చెప్తా. ఇంత చిన్న విషయానికి నీవు బడి మానవద్దు” అంటూ రామును ఓదార్చారు సురేష్‌ మాస్టారు. మాస్టారు ఇచ్చిన ధైర్యంతో ”థాంక్‌ యూ సర్‌” అంటూ ఉత్సాహంగా ఇంటికి వెళ్లాడు రాము.

– యం.రాం ప్రదీప్‌,
తిరువూరు, 94927 12836

➡️