నేటి నుంచి టెట్‌

Feb 27,2024 10:20 #AP, #tet exams
  • 2,67,559 మంది దరఖాస్తు
  • సమీప కేంద్రాల్లో గర్భిణులకు అవకాశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 6వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే పరీక్షలకు 2,67,559 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. మొత్తం 120 పరీక్షా కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంతోపాటు తెలంగాణలో 3, కర్ణాటకలో 3, తమిళనాడులో 2, ఒడిశాలో 2 చొప్పున పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నెల 27 నుంచి మార్చి ఒకటి వరకు పేపర్‌-1ఎ ఉదయం, మధ్యాహ్నం పూట జరుగుతాయని పేర్కొన్నారు. పేపర్‌-2ఎ మార్చి 2, 3, 4, 6 తేదీల్లో రెండు పూటలా, పేపర్‌-1బి మార్చి 5వ తేదీ ఉదయం, పేపర్‌-2బి మధ్యాహ్నం జరుగుతాయని వెల్లడించారు. ఉదయం పూట 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిశీలనకు 26 మంది పాఠశాల విద్యాశాఖ సీనియర్‌ అధికారులను నియమించామని తెలిపారు. ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించే సమయంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 7:30 నుంచి సాయంత్ర 7 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. గర్భిణి అభ్యర్థులకు సమీప పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించామని వెల్లడించారు. అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి సమాచారం ఇవ్వాలని సూచించారు.

➡️