ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

Feb 1,2024 22:59

ప్రజాశక్తి – బాపట్ల
రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఎపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఎ శేఖర్ బాబు అధ్యక్షత వహించిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిడి సోషలిజం మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ తక్షణమే అమలు చేయాలన్నారు. బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని అన్నారు. పిఎఫ్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉద్యోగ, ఉపాధ్యాయుల మాదిరి ఏపీపీఎస్సీ పరీక్షకు వయోపరిమితిని సడలించి మున్సిపల్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు వై నేతాంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని నూతన పాఠశాలలు నెలకొల్పాలని కోరారు. డిఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు తక్షణం భర్తీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సబ్ కమిటీ సభ్యులు జంపాని శ్రీనివాసరావు, బి నాగాంజనేయులు, డి రవి, చెంచురామారావు, చెన్నకేశవులు, కోటయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు తేలప్రోలు శ్రీనివాసరావు, మాడుగుల కిషోర్ బాబు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రహంతుల్లా, వెంకట రత్నం, ప్రశాంత్, నారాయణ, ప్రసాద్ చీరాల, బాపట్ల, రేపల్లె మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️