కళారంగంలో ప్రతిభామణులు

Mar 8,2024 08:59 #feature

గృహిణిగా ఇంటి బాధ్యతలను మోస్తూనే తమకు ఇష్టమైన కళలో రాణించవచ్చని నిరూపిస్తున్నారు ఈ మహిళలు. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ రంగంలో విశేష ప్రతిభ చూపిస్తున్న వీరికి ‘ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌’ సంస్థ కొండంత చేయూత నిస్తోంది. ఆ ప్రోద్బలంతో ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు వారి సొంతమయ్యాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం !

విజయవాడకు చెందిన అరసవల్లి సంధ్యారాణి, ముత్యాల లక్ష్మీ సుధారాణి, లలితా సౌజన్య, మేడా రజని, స్వాతి పూర్ణిమ సాధారణ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ రంగంలో రాణించడం వెనుక వారి కృషి, పట్టుదల ఎంతో ఉంది.

సంధ్యారాణి..

              అజిత్‌ సింగ్‌ నగర్‌ ఇందిరా నాయక్‌ కాలనీలో ఉంటున్న సంధ్యారాణి భర్త అరసవల్లి గిరిధర్‌, ప్రముఖ ఆర్టిస్ట్‌ అండ్‌ గ్రాఫిక్‌ డిజైనర్‌. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో సంధ్యారాణి కూడా తనలో దాగున్న కళను తీర్చిదిద్దుకున్నారు. స్వల్ప కాలంలోనే పెన్సిల్‌ షేడింగ్‌, వాటర్‌ కలర్స్‌, ఆక్రలిక్‌ కలర్స్‌ పెయింటింగ్స్‌ చేయటంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత శిక్షణనిస్తూ వారిని చిత్రలేఖనం పోటీలకు సంసిద్ధం చేస్తుంటారు. రాష్ట్ర టెక్నికల్‌ డిపార్ట్మెంట్‌ నిర్వహించే డ్రాయింగ్‌ లోయర్‌ అండ్‌ హయ్యర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై, టిటిసి కోర్సుని కూడా పూర్తిచేశారు. వివిధ సంస్థలు నిర్వహించిన చిత్రకళా వర్కుషాపులు, చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొని తన ప్రతిభను చాటుతున్నారు. తరుణీ తరంగాలు, మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం మహిళా విభాగం, స్ఫూర్తి చారిటబుల్‌ ట్రస్ట్‌, అమరావతి బాలోత్సవం వంటి సంస్థల కార్యక్రమాల్లో భాగమవుతున్నారు.

ముత్యాల లక్ష్మీ సుధారాణి

              పటమట వాసి అయిన ముత్యాల లక్ష్మీ సుధారాణికి చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో నోట్‌ పుస్తకాల నిండా పత్రికల్లో వచ్చే కార్టూన్‌ బొమ్మలు, దిన పత్రికల లోగోలు నింపేసేవారు. చిన్న వయసులోనే వివాహం జరగటంతో తన బాల్యపు ఆసక్తిని పక్కన పెట్టేశారు. కుటుంబ బాధ్యతల నుంచి కాస్తంత తీరిక చేసుకుని ఆర్టిస్ట్‌ అనుమకొండ సునీల్‌ కుమార్‌ దగ్గర శిష్యరికం చేశారు. భర్త రామకృష్ణ ప్రోత్సాహం కూడా తోడై చిరకాలంలోనే డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సులో లోయర్‌ అండ్‌ హయ్యర్‌ గ్రేడ్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 2016లో సునీల్‌ కుమార్‌ ‘ఆర్ట్మేట్‌ ది స్కూల్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్స్‌’లో విద్యార్థిగా చేరి ఇప్పుడు అదే స్కూల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. పెన్సిల్‌ షేడింగ్‌, వాటర్‌/ పోస్టర్‌/ ఆక్రలిక్‌/ ఆయిల్‌ పెయింటింగ్‌, పాట్‌ పెయింటింగ్‌, స్పాట్‌ పెయింటింగ్‌, క్లే మౌల్డింగ్‌, గ్లాస్‌ పెయింటింగ్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ లతో పాటు క్రియేటివ్‌గా కాఫీ పెయింటింగ్‌ చేస్తూ కళా ప్రియులను అలరింపచేస్తున్నారు. బిర్లా ఓపెన్‌ మైండ్స్‌ స్కూల్లో పార్ట్‌ టైం ఆర్ట్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సామాజిక అంశాలపై చైతన్యవంతమైన చిత్రాలు గీయడం సుధారాణి ప్రత్యేకత. ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు స్పాట్‌ పెయింటింగ్స్‌ చేయించటం కోసం నిర్వహించే ఫీల్డ్‌ ట్రిప్‌లలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

లలితా సౌజన్య

                కృష్ణలంకకు చెందిన లలితా సౌజన్య బాల్యంలో తండ్రిని కోల్పోయారు. అమ్మే అన్నీ తానై పెంచింది. కూతురు అభిరుచులను ప్రోత్సాహిస్తూ ఉన్నతంగా నిలబెట్టింది. బాల్యం నుంచి ఒంటబట్టిన చిత్రకళను ఉన్నత విద్య అభ్యసిస్తున్నా కొనసాగించారు సౌజన్య. రాష్ట్ర ప్రభుత్వ టెక్నికల్‌ డిపార్ట్మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షల్లో ప్రథమ స్థానంలో పాసై 45 రోజుల పాటు టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు కూడా పూర్తి చేశారు. ఇండియన్‌ రైల్వే డిపార్ట్మెంట్‌లో లాబీ సూపర్వైజర్‌గా కొంత కాలం విధులను నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందారు. ఆర్ట్‌ కాంటెస్ట్‌లు, ఈవెంట్లు ఎక్కడ జరిగినా చురుకుగా పాల్గొంటారు. భవిష్యత్తులో తన చిత్రించిన చిత్రాలతో సోలో ఎగ్జిబిషన్‌ నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నారు.

స్వాతి పూర్ణిమ

              పోరంకికి చెందిన స్వాతి పూర్ణిమకి బాల్యం నుంచి చిత్రకళపై మక్కువ ఎక్కువ. వివాహం తరువాత తన కుమారుడికి ఆ కళ నేర్పించాలన్న ఆలోచనతో ఆర్ట్‌ స్కూల్‌కి వెళ్లారు. ఆ క్రమంలో అక్కడే తన కళా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. గోరా సైన్స్‌ సెంటర్‌, తరుణీ తరంగాలు నిర్వహించిన పలు డ్రాయింగ్‌ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందారు. జాషువా జయంతోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. పెన్సిల్‌ షేడింగ్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, ఆక్రలిక్‌ పెయింటింగ్‌లతో పాటు బెస్ట్‌ ఫ్రం ది వేస్ట్‌ వర్క్స్‌ చేయటంలో మంచి నేర్పరి.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో మార్చి 10వ తేదీన బాలోత్సవ్‌ భవన్‌లో ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, బెస్ట్‌ ఫ్రం ది వేస్ట్‌, పేపర్‌ క్విల్లింగ్‌ల ఎగ్జిబిషన్‌ జరుగుతుంది. ఇందులో పాల్గొంటున్న ఈ ప్రతిభావనులు మున్ముందు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం.

మేడా రజని

            అయ్యప్ప నగర్‌óకు చెందిన మేడా రజనికి బాల్యం నుంచి కాగితాలతో అందమైన కళాకృతులు చేయడం హాబీ. ‘పేపరు క్విల్లింగ్‌ ఆర్ట్‌’ పేరుతో ఆమె తయారు చేసిన కళారూపాలు విశేష ప్రజాదరణ పొందాయి. కళను విస్తరిస్తూ తనతో పాటు మరికొంతమంది మహిళలకు ఉపాధిని కూడా చూపిస్తున్నారు. ‘సింధు డిజైన్స్‌’ పేరుతో కుటీర పరిశ్రమ స్థాపించి శుభకార్యాలకు పేపర్‌ బ్యాగులు, కాగితపు పూలతో చేసిన ప్లవర్‌ వాజ్‌లు, బొకేలు, పూల జడలు, పేపర్‌ క్విల్లింగ్‌ ఆర్ట్స్‌తో చేసిన ఫొటో ఫ్రేములు, మైనంతో చేసిన కొవ్వొత్తులు అందిస్తున్నారు. ఇలా ఎందరికో ఉపాధి చూపిస్తున్న రజిని కళారంగంలో విశేష కృషికి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి.

➡️