Sonia Gandhi : పోస్టర్లూ.. ప్రింట్‌ చేయలేకపోతున్నాం

పర్యటనలకూ వెళ్లలేకపోతున్నాం
ఎన్నికల వేళ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనపై కాంగ్రెస్‌ నేతలు
ప్రజలు ఇచ్చిన విరాళాలను వాడుకోకుండా చేయడం దారుణం
ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేయకుండా అడ్డుకునేందుకే మోడీ కుట్ర
బిజెపి ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన కేంద్రం తీరుపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, అజరు మాకెన్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కేవలం తమ పార్టీకే కాదు, యూవత్‌ ప్రజాస్వామ్యానికే హానికరమని అన్నారు. పార్టీ కోసం ప్రజలు ఇచ్చిన విరాళాలను వాడుకోకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోందన్నారు. బిజెపి వేల కోట్లు విరాళాలుగా తీసుకుందని, అయినా వారి ఖాతాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, కేవలం తమ పార్టీ ఖాతాలనే స్తంభింపచేయడం కేంద్ర ప్రభుత్వ కుట్ర అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిష్పక్షపాత ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలుండాలని ఖర్గే పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డంకులు సృష్టించడం దారుణమని అన్నారు.

ప్రధాని మోడీ వ్యవస్థీకృత దాడి: సోనియా గాంధీ
కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై సోనియా గాంధీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఒక పథకం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎలక్టోరల్‌ బాండ్ల అంశం కేవలం కాంగ్రెస్‌ పార్టీపై మాత్రమే ప్రభావం చూపదని, ప్రాథమికంగా అది మన ప్రజాస్వామ్యాన్నే దెబ్బతీస్తుందని ఆమె తెలిపారు. విపత్కర పరిస్థితులు, సవాళ్ల మధ్య తమ ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ఎలక్టోరల్‌ బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, వీటి వల్ల బిజెపికి అధిక లాభం చేకూరిందని, ఆ పార్టీని విడిచిపెట్టి మా పార్టీపై దాడి చేయడం దారుణమని అన్నారు.

ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేకపోతున్నాం: రాహుల్‌ గాంధీ
కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ అకౌంట్లను స్తంభింపజేయడంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేకపోతున్నామని ఎంపి రాహుల్‌ గాంధీ తెలిపారు. ఎవరిదైనా బ్యాక్‌ అకౌంట్‌ మూసివేసినా, ఎటిఎం కార్డు పని చేయకుండా చేస్తే జీవించగలరా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలల ముందే తమ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా.. క్రిమినల్‌ చర్యకు దిగారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉన్న కొన్ని సంస్థలు ఇప్పుడు ఆ పనిచేయలేకపోతున్నాయని, కోర్టులు కూడా ఇది అన్యాయమని గట్టిగా చెప్పలేకపోతున్నాయని, ఎన్నికల సంఘం మౌనంగా ఉండిపోయిందని విమర్శించారు. భారత్‌లో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
పార్టీ ఖాతాల్లో ఉన్న రూ. 285 కోట్లను వాడుకోకుండా అడ్డుకోవడంతో ఎన్నికల పోస్టర్లు కూడా వేయలేని పరిస్థితి కల్పించారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఏడేళ్ల నాటి కేసులో పార్టీకి నోటీసులు జారీ చేశారని అన్నారు. బిజెపితో సహా ఏ రాజకీయ పార్టీ కూడా ఆదాయపు పన్ను చెల్లించనప్పటికీ, కాంగ్రెస్‌కు చెందిన 11 బ్యాంకు ఖాతాలను ఎందుకు స్తంభింప చేశారని ఆయన ప్రశ్నించారు.

➡️