చెమట చుక్కే ఆయుధంగా…

Jan 9,2024 11:04 #feature

పేదరికంలో పుట్టి పెద్ద కల కన్నాడు అతను. ఆ కలలో అతని కోసమే కాదు.. తన చుట్టూ ఉన్నవారి బాగోగులు కూడా చూశాడు. అందుకే ఎన్ని కష్టాలు పడ్డా లక్ష్యం చేరుకునేవరకు విశ్రమించలేదు. ఆ దారిలోనే మధుమేహ బాధితుల కోసం నూతన ఆవిష్కరణ చేశాడు. చెమట ద్వారా షుగర్‌ వ్యాధి నిర్ధారణ చేయొచ్చన్న పరిశోధనా పరికరంపై ఇటీవల భారత ప్రభుత్వం (ఇండియన్‌ పేటెంట్‌ అథారిటీ) నుండి పేటెంట్‌ హక్కు పొందిన ఏలూరుకు చెందిన వూసా.చిరంజీవి శ్రీనివాసరావు గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది.

              జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన శ్రీనివాసరావు ప్రస్తుతం ఐఐటి కాన్పూర్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ‘మధుమేహాన్ని నిర్ధారణ చేయాలంటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను అంచనా వేస్తాం. అయితే రక్తనమూనా తీసుకోవాలంటే ఒకింత నొప్పి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. కొంతమంది బాధితులు తరచూ రక్త నమూనా ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు కూడా మధుమేహ బాధితులే. ఔషధాలు, ఇన్సులెన్లు వారి జీవితంలో భాగమై పోయాయి. ఒక్కోసారి రోజుకు రెండు నుండి నాలుగు సార్లు గ్లూకోజు స్థాయిలు అంచనా వేయాల్సి వస్తుంది. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, పిల్లల్లో తరచూ ఈవిధమైన పరీక్షలు చేయాలి అంటే, అన్నిసార్లూ రక్తం సేకరించాలి. అప్పుడు విపరీతమైన నొప్పితో పాటు, ఇన్సులెన్‌ తీసుకునే క్రమం తప్పితే కోమాలోకి వెళ్లే ప్రమాదం వుంటుంది. అటువంటి బాధితుల కోసమే చెమట ద్వారా గ్లూకోజ్‌ స్థాయిలను అంచనా వేసే పరికరాన్ని ఆవిష్కరించాను. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రోకెమికల్‌, సెన్సర్లను ఉపయోగించి నాలుగేళ్ల పాటు శ్రమించి ఈ పరికరం తయారుచేశాను. నా పరిశోధనలో ఓ విద్యార్థి, ప్రొఫెసర్‌ కూడా భాగమయ్యారు. మన దేశంలో ఇది తొలి ప్రయోగం. రెండేళ్లపాటు దీనిని పరీక్షించి ప్రభుత్వం పేటెంట్‌ హక్కులు ఇచ్చింది. చాలా ఆనందంగా ఉంది’ అంటున్న, శాస్త్రవేత్తగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న శ్రీనివాసరావు నిరుపేద కుటుంబం నుండి వచ్చారు.

ఆ రోజు రక్తం కంటే కన్నీళ్లు ఎక్కువ కారాయి

             శ్రీనివాసరావు తండ్రి వాచ్‌మెన్‌గా, రోజు కూలీ చేస్తూ అమ్మ జీవనం సాగించేవారు. శ్రీనివాసరావుతో పాటు ఓ అమ్మాయి ఆ దంపతుల సంతానం. చాలీచాలని సంపాదనతో రెండు పూటలా తిండి తినడమే కష్టమైన ఆర్థికపరిస్థితుల్లో కుటుంబం గడవడం కోసం చదువుకు కొన్ని రోజులు విరామం ఇచ్చి మరీ ఆయన కూలి పనులు చేశారు. ‘మా గ్రామం హైవే పక్కనే ఉండేది. అయినా అదంతా ఓ అడవిని తలపించేది. స్కూలుకు వెళ్లే పిల్లలు చాలా తక్కువ. అటువంటి చోట పుట్టి పెరిగిన నేను ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే విద్యభ్యాసం సాగించాను. అయినా పుస్తకాలు, బట్టలు కొనుక్కునేందుకు ఇంట్లో డబ్బులు ఉండేవి కావు. ఒకసారి అక్క ప్రసవానికి ఇంటికి వచ్చింది. నెలలు దగ్గర పడడంతో అక్కను తీసుకుని అమ్మ ఆస్పత్రికి వెళ్లింది. అప్పుడే నాన్నకు లారీ యాక్సిడెంట్‌ అయ్యింది. మంచానికే పరిమితమయ్యాడు. ఆ పరిస్థితుల్లో నేను కూలి పనికి వెళ్లాల్సి వచ్చింది. స్కూలుకు సెలవు పెట్టి పొలం పనికి వెళ్లాను. కోత కోయడం చేతకాక, కొడవలి వేటుకు చేయి తెగింది. రక్తం ధారలాగా కారింది. విపరీతమైన నొప్పి వచ్చింది. అంత బాధలోనూ ఎవరైనా చూస్తే ఇంటికి పంపించేస్తారేమో, కూలీ డబ్బులు లేకుండా ఇంటికి వెళితే ఇల్లు గడిచేదెలా అన్న భయం వెంటాడింది. అక్కడే ఆకులు, అలములు గాయం చుట్టూ గట్టిగా కప్పుకుని కోత కోశాను. అయినా రక్తం అదేపనిగా కారింది. డబ్బులు ఇవ్వకుండా పని ఆపేసి మధ్యలో పంపుతారన్న భయంతో రక్తం కంటే ఎక్కువగా ఆరోజు నా కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి’ అని తను 10వ తరగతి చదివేటప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు శ్రీనివాసరావు.

జాలి చూపులు ఇష్టం లేదు

ఇప్పుడు ఓ శాస్త్రవేత్తగా ఆయనను సమాజం ఎంతో గౌరవిస్తోంది. నూతన ఆవిష్కరణలు చేసిన గొప్ప వ్యక్తిగా కీర్తిస్తోంది. ఈ స్థాయికి రావడానికి ఆయన పడ్డ కష్టాలు, బాధలు, అవమానాలు ఎవరికీ తెలియవు. ‘అసలు ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. నేను పేదరిక కుటుంబం నుండి వచ్చానని, కూలీపనులు చేస్తూ చదువుకుంటున్నానని నా స్నేహితుల్లో కూడా చాలామందికి తెలియదు. పేదరికం పేరుతో ఇతరులు నాపై జాలి చూపించాలని నేనెప్పుడూ అనుకోలేదు. పేదరికం, కులం, మతం మన లక్ష్యానికి అడ్డుగోడలుగా ఉండకూడదు. మనుషులంతా ఒక్కటే. నాకు ఎదురైన పరిస్థితులే నన్ను ఈ స్థాయికి వచ్చేలా చేశాయి. విద్య ద్వారానే నా స్థితిని మార్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాను. అయితే ఆ విద్య నాకు మాత్రమే కాక, నా చుట్టూ ఉన్న వారికి కూడా ఉపయోగపడాలని అనుకున్నాను. అందుకే ప్రజలకు ఉపయోగపడే, ముఖ్యంగా పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వివిధ పరిశోధనలు చేస్తున్నాను. అందులో ఒకటే చెమట ద్వారా గ్లూకోజ్‌ నిర్ధారణ’ అంటున్నప్పుడు ఆయన మాటల్లో నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది.

సంభాషణ : జ్యోతిర్మయి

➡️