146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ , రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ ఫోరం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ఇండియా కూటమి పక్షాల నేతలు ధర్నా చేశారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. ”అనేకమంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అలాంటి ఈ దేశంలో ఇప్పుడు అరాచక పాలన సాగుతోంది. పార్లమెంటులో జరిగిన అలజడిపై హౌంమంత్రి అమిత్‌షా నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. పార్లమెంటులో అసలు ఏమీ జరగలేదనే విధంగా ప్రధాని మోదీ, అమిత్‌ షా వ్యవహరిస్తున్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు. దేశ రక్షణను బిజెపి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజాస్వామ్యాన్ని ప్రజలంతా కాపాడాల్సిన అవసరం ఉంది” అని భట్టి పేర్కొన్నారు.

➡️