సిఎంపై రాయి విసిరిన అనుమానితుడి అరెస్టు

Apr 19,2024 08:35 #attack, #cm jagan
  • ఇద్దరు నిందితుల గుర్తింపు
  •  12 మందిని విచారించిన పోలీసులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి చేసిన కేసులో అనుమానితుడు వేముల సతీష్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్‌ విధించడంతో నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. రెండో అనుమానితుడు వేముల దుర్గారావును కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. ఉద్దేశపూర్వకంగా పదునైన రాయితో సిఎంను కొట్టి, హత్యాయత్నం చేశారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం…. రెండో నిందితుడైన వేముల దుర్గారావు కుట్రపూరితంగా ప్రేరేపించడంతో సతీష్‌ రాయితో సిఎంను కొట్టాడు. సెల్‌ఫోన్‌ డేటా, సిసి టివి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. ఈ నెల 17న రాజరాజేశ్వరిపేటలో సతీష్‌ను అరెస్టు చేసి, అతని నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ కుట్రతోనే సతీష్‌ సిఎంపై హత్యాయత్నం చేశాడు. పదునైన రాళ్లను ప్యాంటు జేబులో పెట్టుకుని రెండు గంటలకుపైగా ఆ ప్రాంతంలో ఎదురుచూశాడు. సిఎం రాగానే ఆయనపై రాయి విసిరాడు. ఈ కేసులో 12 మంది సాక్షులను విచారించి, వారందరి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ప్రత్యక్ష సాక్షులూ ఉన్నారని, వారిచ్చిన సమాచారం, సాంకేతిక సమాచారం మొత్తం సరిపోయిందని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వివరించారు.

సతీష్‌కు నేరచరిత్ర లేదు : న్యాయవాది సలీం
నిందితుడు సతీష్‌ మైనర్‌ అని, అతనికి నేర చరిత్ర లేదని, పోలీసులు సూచించిన పుట్టిన తేదీకి, ఆధార్‌ ఆధారంగా ఇచ్చిన తేదీకి తేడా ఉందనీ సతీష్‌ తరపున న్యాయవాది సలీం కోర్టుకు తెలిపారు. ఈ కేసులో 307 సెక్షన్‌ వర్తించదని పేర్కొన్నారు. దురుద్దేశంతోనే రాయి విసిరాడని, అతనికి 307 సెక్షన్‌ వర్తిస్తుందని పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

వడ్డెర కాలనీ ఖాళీ
నిందితులు వేముల సతీష్‌కుమార్‌ అరెస్టు, సాక్షుల పేరుతో యువకులను పోలీసులు తీసుకెళుతుండటంతో వడ్డెర కాలనీ ప్రజలు చెల్లాచెదురయ్యారు. వడ్డెర కాలనీలో ఉన్న నాలుగైదు రోడ్లలో ప్రజలందరూ ఊరు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. పోలీసులు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నామని, అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా విచారణ పేరుతో వచ్చి పిల్లలను పట్టుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి నేత వేముల దుర్గారావు కూడా నిందితుడని పేర్కొనడంతో ప్రజలందరూ ఇళ్లు వదిలి వెళ్లిపోయారు.

➡️