ఉప్పల్‌లో ‘సన్‌.. షైన్‌…’

  • చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో ఘన సన్‌రైజర్స్‌ గెలుపు

హైదరాబాద్‌: ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై 31 పరుగుల తేడాతో నెగ్గిన సన్‌రైజర్స్‌.. శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నైను సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 165పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 166పరుగులు చేసి గెలిచింది. ఉప్పల్‌ స్టేడియంలో టాస్‌ ఓడిన చెన్నైకు హైదరాబాద్‌ బౌలర్లు కళ్లెం వేశారు. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆదిలోనే షాక్‌ ఇచ్చాడు. డేంజరస్‌ ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర(12)ను ఔట్‌ చేశాడు. రచిన్‌ భారీ షాట్‌ ఆడబోయి మర్క్‌రమ్‌ చేతికి చిక్కాడు. దాంతో 25 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ కాసేపటికే రుతురాజ్‌ గైక్వాడ్‌(26)ను ఫాబాజ్‌ అహ్మద్‌ వెనక్కి పంపాడు. 54 పరుగులకే రెండు వికెట్లు పడిన చెన్నైను రహానే(35), దూబే(45)లు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 63 రన్స్‌ జోడించారు. ఆ తర్వాత జడేజా(31నాటౌట్‌), డారిల్‌ మిచెల్‌(15)లు ధాటిగా ఆడడంతో చెన్నై ఆ మాత్రం స్కోర్‌ చేయగలిగింది. దాంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 165పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో కమిన్స్‌, నటరాజన్‌, ఉనాద్కట్‌, భువనేశ్వర్‌లు తలా ఒక వికెట్‌ పడగొట్టారు.
ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కింది. అభిషేక్‌ శర్మ(37; 12బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. మరోవైపు హెడ్‌కూడా రాణించడంతో సన్‌రైజర్స్‌ 2.4ఓవర్లలోనే 46పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ తర్వాత మాజీ కెప్టెన్‌ మార్‌క్రమ్‌(50; 36బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్‌) అర్ధసెంచరీకి తోడు షాబాజ్‌(18) బ్యాటింగ్‌లో రాణించారు. చివర్లో క్లాసెన్‌(10), నితీశ్‌ రెడ్డి(14) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. దీంతో సన్‌రైజర్స్‌ జట్టు కేవలం 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లు మొయిన్‌ అలీకి రెండు, తీక్షణ, దీపక్‌ చాహర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ రవీంద్ర (సి)మార్‌క్రమ్‌ (బి)భువనేశ్వర్‌ 12, రుతురాజ్‌ గైక్వాడ్‌ (సి)అబ్దుల్‌ సమద్‌ (బి)షాబాజ్‌ అహ్మద్‌ 26, రహానే (సి)మార్కండే (బి)ఉనాద్కట్‌ 35, శివమ్‌ దూబే (సి)భువనేశ్వర్‌ (బి)కమిన్స్‌ 45, జడేజా (నాటౌట్‌) 31, మిఛెల్‌ (సి)అబ్దుల్‌ సమద్‌ (బి)నటరాజన్‌ 13, ధోనీ (నాటౌట్‌) 1, అదనం 2, (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 165పరుగులు.
వికెట్ల పతనం: 1/25, 2/54, 3/119, 4/127, 5/160
బౌలింగ్‌: అభిషేక్‌ శర్మ 1-0-7-0, భువనేశ్వర్‌ కుమార్‌ 4-0-28-1, నటరాజన్‌ 4-0-39-1, పాట్‌ కమిన్స్‌ 4-0-29-1, మార్కండే 2-0-21-0, షాబాజ్‌ అహ్మద్‌ 1-0-11-1, ఉనాద్కట్‌ 4-0-29-1.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి)రవీంద్ర (బి)తీక్షణ 31, అభిషేక్‌ శర్మ (సి)జడేజా (బి)దీపక్‌ చాహర్‌ 37, మార్‌క్రమ్‌ (ఎల్‌బి)మొయిన్‌ 50, షాబాజ్‌ అహ్మద్‌ (ఎల్‌బి)మొయిన్‌ 18, క్లాసెన్‌ (నాటౌట్‌) 10, నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 14, అదనం 6. (18.1 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 166పరుగులు.
వికెట్ల పతనం: 1/46, 2/106, 3/132, 4/141
బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3.1-0-32-1, ముఖేశ్‌ చౌదరి 1-0-27-0, తీక్షణ 4-0-27-1, దేశ్‌పాండే 2-0-20-0, జడేజా 4-0-30-0, మొయిన్‌ 3-0-23-2, రచిన్‌ రవీంద్ర 1-0-3-0

➡️