అటకెక్కిన గోదావరి డెల్టా ఆధునీకరణ!

Feb 17,2024 07:39 #Delta, #development, #Stories
Stuck Godavari Delta modernization!
  •  రూ. వెయ్యి కోట్ల పనులు కాగితాలకే పరిమితం 
  • కాలువలు మెరకదేరి ఏటా వేలాది ఎకరాల్లో పంట నష్టం 
  • రబీలో సాగు ఎద్దడితోతీవ్ర అవస్థలు 
  • ప్రభుత్వ తీరుపైరైతుల ఆగ్రహం

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. ఈ ఏడాదీ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో, ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి డెల్టా కింద 5.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 11 ప్రధాన కాలువ లు ఉన్నాయి. వైసిపి సర్కార్‌ అధికారంలోకొచ్చాక డెల్టా ఆధునీకరణను పూర్తిగా పక్కకు పెట్టేసింది. దీంతో, ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో వర్షపు నీరు కిందకు పారక పొలాల్లో నీరు నిల్వ ఉండి వేలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోతున్నారు. డెల్టా ఆధునీకరణ పూర్తి చేయాలని ఏటా రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రబీకి సాగునీటి సరఫరాకు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఏటా నవంబర్‌లో జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంఎల్‌ఎలు, జిల్లా కలెక్టర్‌, జిల్లా అధికారులలు వస్తుంటారు. డెల్తా ఆధునీకరణ పనులు చేపట్టాలని, జనవరిలో పనులకు టెండర్లు ఖరారు చేయాలని, కాలువలకు నీటి విడుదల నిలిపివేసిన వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ తీర్మానించి ప్రభుత్వానికి పంపుతున్నా ఆమోదముద్ర పడడం లేదు. గడిచిన నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. కాలువలపై పని చేసే లస్కర్లకు సైతం ఏడాదిగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో, ప్రధాన కాలువలతోపాటు పిల్ల కాలువలు పూర్తిగా మెరకదేరి దిగువ పొలాలకు సాగు నీరందడం లేదు. ఖరీఫ్‌లో నీరు కిందకు దిగక వరద నీటి కష్టాలు, రబీలో సాగునీటి ఎద్దడి సమస్యతో జిల్లా రైతులు సతమతమవుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. అయినా ప్రభుత్వంలో ఏ మాత్రమూ చలనం లేదు.

ఈ ఏడాదీ అదే నిర్లక్ష్యం

2007లో పశ్చిమగోదావరి జిల్లాలోని డెల్టా ఆధునీకరణకు రూ.1400 కోట్లు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. 2018 వరకూ దాదాపు రూ.800 కోట్లు పనులు జరిగాయి. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఆ తర్వాత నుంచి పనులు ఆగిపోయాయి. ఇంకా రూ.600 కోట్లు పనులు మిగిలిపోయాయి. పెరిగిన ధరలతో ప్రస్తుతం పనుల విలువ రూ.వెయ్యి కోట్లకు చేరింది. ఈ పనులకు సంబంధించి ఇరిగేషన్‌ అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా డెల్టా ఆధునీకరణ పనుల్లో కదలిక లేదు. వెంటనే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే, కాలువలకు నీటి విడుదల నిలిచిపోయే సమయానికి టెండర్లు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి అటువంటి సూచనలు కానరాకపోవడంతో ఈ ఏడాదీ డెల్టా ఆధునీకరణ అటకెక్కినట్లేనంటూ ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. డెల్టా ఆధునీకరణ పనులపై ఇరిగేషన్‌ ఎస్‌ఇ శ్రీనివాసరావును ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా రూ.వెయ్యి కోట్ల పనులకు సంబంధించి ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించామని తెలిపారు. వాటికి ఆమోదం వచ్చిన వెంటనే అందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పనులు చేపట్టాలDel

ఏలూరు జిల్లాలో గోదావరి, కృష్ణా డెల్టాల ఆయకట్టు భూములు శివార్లలో ఉన్నాయి. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు జరగకపోవడంతో ఖరీఫ్‌, రబీ లోనూ సాగు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువల నిండా తూడు, గుర్రపు డెక్క, కర్ర నాచు పేరుకుపోయింది. షట్టర్లు ఎక్కడికక్కడే పాడైపోయాయి. నీటి ఎద్దడి, ముంపు సమస్య పరిపాటైంది. ప్రభుత్వం డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టి రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి.-కె.శ్రీనివాస్‌, ఎపి రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి

➡️