దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం వర్గ పోరాటాలు బలోపేతం

Jan 22,2024 08:30 #press meet, #seetharam yechuri

– సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

– పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా విఐ లెనిన్‌ శత వర్థంతి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం వర్గ పోరాటాలను బలోపేతం చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆదివారం నాడిక్కడ సిపిఎం ప్రధాన కార్యాలయం (ఎకెజి భవన్‌)లో విఐ లెనిన్‌ శత వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత సిపిఎం నేతలు లెనిన్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. లెనిన్‌ తన 54 ఏళ్ల స్వల్ప జీవితంలో ప్రపంచంలోనే మొదటి దోపిడీ రహిత సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించి, మానవ చరిత్రను తిరుగులేని విధంగా మార్చగలిగారని తెలిపారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడంతోపాటు దోపిడీ లేని సమాజాన్ని నిర్మించిన గొప్ప వ్యూహకర్త లెనిన్‌ అని అన్నారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ప్రపంచాన్ని మార్చడం కూడా సాధ్యమేనని నిరూపించిన మహా నాయకుడు లెనిన్‌ అని చెప్పారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విప్లవకారులందరికీ లెనిన్‌ స్ఫూర్తి అని పేర్కొన్నారు. లెనిన్‌ శత వర్థంతి రోజున, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడానికి, భారతదేశంలో వర్గ పోరాటాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలను తీవ్రతరం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. రామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 22న కార్యాలయాల సెలవును ఖండిస్తున్నాంఅయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట రోజున సెలవు ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నామని, మతపరమైన కార్యక్రమంలో ప్రభుత్వం పాల్గనడం సరికాదని ఆయన అన్నారు. 22న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. ఒక మతానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించడం దారుణమన్నారు. ప్రభుత్వ సంస్థలు మూసివేయడం మంచిది కాదని, అందులోనూ ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఎయిమ్స్‌కు సెలవు ప్రకటించడం దారుణమని అన్నారు. మతపరమైన కార్యక్రమాలతో ప్రభుత్వ పాలనను కలపడం ఆమోదయోగ్యం కాదన్నారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించాలని ప్రధాని మోడీ ఒత్తిడి తేవడం దారుణంరాష్ట్రాలకు పన్నుల వాటా కేటాయింపు తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకున్నట్లు వచ్చిన వార్తలు దిగ్భ్రాంతికి గురి చేశాయని ఏచూరి అన్నారు. ఈ విషయాన్ని ఇండియా ఫోరం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటాను తగ్గించేందుకు రహస్య వ్యూహాన్ని అమలు చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై కేరళ ఏళ్ల తరబడి లేవనెత్తుతున్న ఆర్థిక సమస్యలు సరైనవేనని బివిఆర్‌ సుబ్రమణ్యం ప్రకటన రుజువు చేస్తోందని పేర్కొన్నారు. కేరళను కేంద్రం ఆర్థికంగా కుంగదీస్తోందని విమర్శించారు.కేంద్ర పన్నుల్లో వాటాను రాష్ట్రాలకు 42 శాతం కాకుండా 32 శాతానికి తగ్గించాలని ప్రధాని పట్టుబట్టినట్లు వెల్లడికావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇది రాజ్యాంగ సంస్థ అయిన ఫైనాన్స్‌ కమిషన్‌ పని, సిఫార్సుల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా, రోజువారీ ఆర్థిక వ్యవహారాలను ప్రభావితం చేసే నిర్ణయాలను కూడా అమలు చేస్తుండడం సరికాదని అన్నారు. పన్నుల వాటాను తగ్గించే ప్రయత్నాలు విఫలమైనప్పుడు వివిధ కేంద్ర పథకాలకు కేటాయింపుల్లో కోత పెట్టేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. ఆ తరువాత సెస్‌, సర్‌ఛార్జిలను పెద్దయెత్తున పెంచడం ప్రారంభించారని, కేంద్ర పన్నుల ఆదాయంలో సెస్‌, సర్‌ఛార్జిలను 28 శాతానికి పెంచారని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్ను వాటాను తగ్గించే రహస్య వ్యూహం అమల్లోకి వచ్చిందన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్న కేరళ ప్రభుత్వం మాట వాస్తవమేనని, ఇలాంటివి స్పష్టం చేస్తున్నాయని అన్నారు.రాష్ట్రానికి కేంద్ర ఆదాయ కేటాయింపులు, రుణాల మంజూరులో భారీ కోత విధిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పన్నుల విధానంలో మార్పులు రాష్ట్ర వనరులను హరిస్తున్నాయని అన్నారు. ఇవన్నీ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో లేవనెత్తుతున్న అంశాలని, ఢిల్లీలో నిర్వహించనున్న ఆందోళనలో కూడా ఈ డిమాండ్లను లేవనెత్తుతుందని ఏచూరి తెలిపారు. లెనిన్‌ శత వర్థంతి కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు నిలోత్పల్‌ బసు, కేంద్ర కమిటీ సభ్యులు జోగేంద్ర శర్మ, హన్నన్‌ మొల్లా, సిపిఎం ఢిల్లీ కార్యదర్శి కెఎం తివారీ, ఎఐకెఎస్‌ నేత కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️