అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచండి : సిహెచ్‌.బాబూరావు

విజయవాడ : విజయవాడ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచాలని, వామపక్షాలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆరవ రోజు ముగింపు ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర కొనసాగుతోంది.

ఈ సందర్భంగా సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ … పదేళ్లయిన తరువాత ఎన్నికల ముందు మోడీకి రైల్వే స్టేషన్లు గుర్తొచ్చాయని… అసలు రైల్వేను నాశనం చేసిందే బిజెపి మోడీ అని అన్నారు. 150 రైల్వే రూట్లను అదానీలు, అంబానీలు పెద్ద పెద్ద కంపెనీలకివ్వడానికి రైల్వేను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్యాసింజర్లను తగ్గించేశారన్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలు లేవని చెప్పారు. గతంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు రైల్వే ప్రయాణంలో రాయితీ ఉండేదని, దాన్ని కూడా కరోనా సమయంలో ఎత్తేసిన అమానుష ప్రభుత్వం మోడి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైల్వే ఏర్పాట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైల్వే లైన్‌లపై ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ బ్రిడ్జిలని అన్నారు కానీ ఒక్కటీ ఇంతవరకు జరగలేదని తెలిపారు. కేవలం ప్రచారార్భాటమే చేశారన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఎక్కడికెళ్లినా పనులు లేవని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకున్న రూ.1500 కోట్ల సంక్షేమ నిధిని అప్పటి తెలుగుదేశ ప్రభుత్వం వాడేసుకుంటే.. ఇప్పుడు జగన్మోహన రెడ్డి వాడుకున్నారని అన్నారు. కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా కార్మికులు చనిపోయినా, ప్రమాదాలు జరిగినా, వివాహం అయినా, పిల్లల చదువులకైనా స్కాలర్‌షిప్‌ల వంటివి ఏవీ లేవని చెప్పారు. సిఎం జగన్‌ ఇచ్చేది తక్కువ-లాగేది ఎక్కువ అయ్యిందన్నారు. ప్రజలపై భారాలు ఎక్కువయ్యాయన్నారు. అందుకే ఈసారి విజయవాడ సెంట్రల్‌ లో అభివృద్ధి కోసం కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వండి అని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో ప్రజలు తమతో చెప్పిన అనేక సమస్యలపై ఉద్యమిస్తామని అన్నారు. ఉమ్మడి పోరాటం సాగిస్తాం.. అందరూ కలిసి రండి అని బాబూరావు పిలుపునిచ్చారు.

 

➡️