మోడీ నిరంకుశత్వం-ఎంపిల సస్పెన్షన్‌పై22న రాష్ట్రవ్యాప్త నిరసనలు

Dec 20,2023 22:05 #loksabha mps, #nirasana, #Suspension

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :మోడీ ప్రభుత్వం పార్లమెంటు నుండి 141 మంది ఎంపిలను సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా వేదిక పిలుపు మేరకు ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్షాలు, కాంగ్రెస్‌, విసికె, ఆమ్‌ ఆద్మీ పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు ఎన్‌ మూర్తి, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌జె విద్యాసాగర్‌, ఆమ్‌ఆద్మీ నాయకులు ఆర్‌ మణినాయుడు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. దేశ పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 141 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్‌ చేసి మోడీ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని తెలిపారు. బిజెపి ఎంపి ఇచ్చిన సిఫార్సు లేఖ ఆధారంగా డిసెంబరు 13న లోక్‌సభ గ్యాలరీలోకి అగంతకులు సందర్శకులుగా ప్రవేశించారని తెలిపారు. పొగబాంబు వదిలి అలజడి రేపారని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై, పార్లమెంటులో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేయాలని ఎంపిలు డిమాండ్‌ చేయడమే నేరంగా పరిగణించిన మోడీ సర్కార్‌ ఉభయ సభల నుండి ఎంపిలను గెంటివేసిందని తెలిపారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోడీ నిరంకుశ విధానాలను ఖండిస్తూ 22న దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఇండియా వేదిక పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. ఈ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు కోరారు.

➡️