ఉపాధి పనులు ప్రారంభించండి

Feb 28,2024 10:20 #MGNREGS

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రం నుండి వలసల నివారణకు ఉపాధి పనులు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండు చేసింది. మంగళవారం సంఘం సమావేశం వడ్డేశ్వరంలోని రాష్ట్ర కార్యాలయంలో దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు పనులు లేక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలు వలసలు పోతున్నారని తెలిపారు. కరువు ప్రాంతాల్లో ఉపాధి పనులు 150 రోజులు కల్పిస్తామని ప్రభుత్వం ప్రటించినా అన్ని జిల్లాల్లో పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు. వెంటనే ఉపాధి పనులు విస్తృతంగా కల్పించి వలసలు అరికట్టాలని కోరారు. సాగర్‌ కాలువ కింద అప్పుడే మంచినీటి ఎద్దడి ప్రారంభమైందని పేర్కొన్నారు. మంచినీటి కోసం మహిళలు చాలా దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు. మున్సిపాలిటీల్లో కలిపిన గ్రామాల్లో ఉపాధి పనులు ఉండటం లేదని, ఆయా గ్రామాల్లో కూడా పనులు కల్పించాలని కోరారు. జగనన్న గృహాలకు ఆర్థికసాయం చాలడం లేదని, ఎక్కువమంది అప్పులుచేసి కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంటికి ఆరులక్షల చొప్పున ఇవ్వాలని కోరారు. సత్యసాయి జిల్లాలో పెనుగొండ, చిలమత్తూరు, నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెం, తిరుపతి జిల్లా నాయుడుపేట, తిరుపతి జిల్లా ఏర్పేడులో పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించి వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని కండించారు.

➡️