ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో నిలవండి

Apr 13,2024 21:05

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు ఉత్తరాంధ్ర అభివృద్దికి చిత్తశుద్దిగా నిలబడాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ కోరారు. శనివారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎం. శ్రీనివాస అధ్యక్షతన జరిగిన సదస్సులో ముందుగా ఉత్తరాంధ్ర మేనిఫెస్టో 2024ను అజశర్మతో పాటు ఎం.శ్రీనివాస, ఎల్‌ఐసి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు వి. జగన్నాథ స్వామి, పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు వి.రామచంద్రరావు ఆవిష్కరించారు .అనంతరం అజశర్మ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలు ఈ మేనిఫెస్టోలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తెలియజేసిందన్నారు. అపారమైన వనరులున్న ఉత్తరాంధ్ర నేటికీ వెనుకబాటులో ఉండడానికి ప్రధాన కారణం పాలకులు నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కాకుండా, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం అత్యంత విచారకరమన్నారు. ఈ ప్రాంతాన్ని గత పదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా పాలకులు అవకాశవాదం ప్రదర్శించారన్నారు. రాష్ట్ర విభజన చట్టం అమలు చేయలేదన్నారు. దీనివల్ల ఈ పదేళ్ల కాలంలో ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటులోకే నెట్టబడిందన్నారు. ఇది చాలాదన్నట్లు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ను అమ్మేయాలని నిర్ణయించిందన్నారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో ఉత్తరాంధ్రలో విస్తారంగా ఉన్న అటవీ భూములను కార్పొరేట్లకు ధారాదత్తం చేసి, గిరిజనులను రోడ్లమీదకు నెట్టాలని చూస్తోందన్నారు. సముద్రంతో సహా సహజ వనరులు అన్నిటిని కార్పొరేట్‌ పరం చేస్తోందన్నారు. రాష్ట్రం, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడాల్సిన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆ పని చేయకపోగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపితో జతకట్టాయన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపికి సహకరించేలా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని ఈ మూడు ప్రధాన పార్టీల అవకాశవాదాన్ని ఎండగట్టి ప్రత్యామ్నాయం వైపు ప్రజల ఆలోచించాలని, రాష్ట్రం, ఉత్తరాంధ్ర అభివృద్ది, స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకై నిలవాలని ఈ సదస్సులో ప్రజలకు పిలుపునిచ్చారు. సదస్సులో మేధావులు,వివిధ ప్రజా సంఘాలు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️