భద్రతా వైఫల్యంపై విచారణ చేపడతాం : స్పీకర్‌ ఓం బిర్లా

న్యూఢిల్లీ :   లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతామని స్పీకర్‌ ఓం బిర్లా ఎంపిలకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపిలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. బుధవారం పార్లమెంటులోకి ఇద్దరు ఆగంతకులు చొరబడిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. లోక్‌సభ లోపల ఇద్దరు ఆగంతకులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. . వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామని చెప్పారు. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే, నిందితులు వదిలిన గ్యాస్‌ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. దీనిపై ప్రతిపక్ష ఎంపిలందరితోనూ ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తామని, సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు కలకలం సృష్టించారు.  సందర్శకులు కూర్చునే గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ వద్ద ఒక రకమైన పొగను  వదిలిపెట్టాడు. అదే సమయంలో పార్లమెంట్‌ భవనం వెలుపల మరో ఇద్దరు పసుపు రంగు పొగను వదిలారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఈ నలుగుర్ని అరెస్టు చేశారు.

లోక్‌సభలోకి చొరబడిన వారు సాగర్‌ శర్మ (20), మనోరంజన్‌ (35) కాగా, పార్లమెంటు ఎదుట ఆందోళన చేపట్టిన వారిని  నీలమ్‌ (42), అమోల్‌ షిండే (25)లుగా గుర్తించినట్లు పోలీస్‌ కమిషనర్‌ సంజయ్  అరోరా తెలిపారు. మనోరంజన్‌ మైసూర్‌కి చెందిన వారని, కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారని అన్నారు. మరొకరు హర్యానాలోని హిస్సార్‌కి చెందినవారని చెప్పారు.  కర్ణాటక బిజెపి ఎంపి ప్రతాప్‌ సిన్హా జారీ చేసిన విజిటర్స్‌ పాస్‌తో సాగర్‌ శర్మ పార్లమెంటులోకి ప్రవేశించడం గమనార్హం.

➡️