మాఘమాసపు జొన్నపిక్క

Apr 15,2024 05:30 #aksharam

శీతకట్టుబెడ్డ దుక్కిల ఎండాకాలపు సెరువుగర్బం లాగ ఇచ్చిపోయి రత్తాపోరైపోయిన పాదాల్ని మెత్తటి మట్టి పెదివిల్తోటి ముద్దెట్టుకుంతే గుండెలోన తేని పొంగి నట్టుండీది! నేలవొంటి మీద జారిన నా సెవట సుక్కలు ఎర్రెర్రని ఆరుద్ర పురుగులై సాలుసాలుకీ పలకరించి మర్నాటికి పలక మీద అచ్చరాల్లాగ పచ్చగ మొలుసుకొచ్చీవి. గింజ మొలకై సినుకమ్మ సిటికి లేని పట్టి నేలపొరల్ని సింపుకోనొత్తాదని ఎరికయ్యంది ‘మట్టిఒడి’లోనే!
బతుకంతే బండిగోర్జిలోన ఎడ్లబండి నడక, అరక నేవ సరిజేసుకోవాలని; సంసారమంతే దమ్ముమడి దుక్కి, ఎలువు, సలువూ ఎరిగి సాలు బయ్యాలని; కొటేరేసిన ఏటికర్రంతేనే భూమితల్లికి పెట్టిన సాష్టాంగ దండమని బోధపడింది ‘బురదగుడి’లోనే!
000
నడకలో నాలుగడుగులు నానే ఎక్కువెయ్యాలని ఏనాడూ పిరియాదు సెయ్యనేదు వలపలెద్దు. సాలు తిరిగినప్పుడల్లా మేడి నొక్కి పడితే బరువంతా నాదేనని పిసరంత బాదకనబర్సనేదు దాపలెద్దు.
”వోరు బడ్డు తిరిగొచ్చినట్టు కొరడాతోటి కొట్టీ, మునకాల కర్ర ముల్లుతోటి ముడ్డిమీద పొడిసీ, మిమ్మల్నెంత యింస పెట్టేనో” అనంతే… నవ్వీసి.. ”పదిమందికి పట్టిడు మెతుకులెట్టడానికే గదా” అని తడితడిగా మాట్లాడి గుండెని తడిపీసీవి ఎడ్లు!

కన్నీరు గుండెకుండలోకి వొంపుకోని, మూగసూపుల్తో కమ్మటి కవుర్లు సెప్పడం తెలిసింది ‘బక్కలదడి’లోనే!

గొప్పు తవ్వీ, పారపనిసేసీ, కొడవలి పట్టి పచ్చగడ్డి కోసీ,
ఏతామెక్కి నీళుతోడీ, వొళ్ళు సెవటకాలవై ఏట్లో దిగితే
సముద్రమే కదిలచ్చి నాగావొళి నదిలోన కలిసినట్టగయ్యీది!
000
నేను మన్నును కలగనోడ్ని. మన్ను నన్ను కలగనీది.
ఒకల్లేప్పోతొకలం లేమని, యిడు జతలై బతకలేమని…!
‘నేలబుగ్గి నెత్తికోడమంతే బగమంతుడి పాదం బుర్ర మీద పెట్టుకోడమే’ అని బోధపడ్డాది ‘మన్నుబడి’లోనే!

గొప్పతనం మడిదో.. మడిలోని మన్నుదో ఏదైతేటి అక్కడ అడుగెట్టగానే తివ్వలోకి కరంటు సొరబడినట్టు నా పాదాలే దువ్వారాల్లాగ నా నరాల్లోకి దూరి, సరసరా గుండెలోకి పారి, కండల్లోన యింకి, నాకే తెలీని సత్తువేదో వొళ్ళంతా కమ్మీసీదంతే- అది మట్టీసారమే!
బురదబుక్కి బురదగక్కి మన్నుముద్దను ఎన్నముద్దగా సేసిచ్చే గుణమబ్బింది ‘మట్టితల్లి ముద్దుతడి’తోనే ..!
000
ఏ సెడుగాలంల అడుగెట్టిందో నా మడిగట్టు మీద ‘నాలుగుండల నాగలి బండి’
ఏ దురుమూర్తాన దుష్టపాదం మోపిందో నక్కజిత్తుల
‘ఉక్కుటెద్దు’,
యాపారానికీ యవసాయానికీ పుట్టిన ఇనపదున్న కూరపాదుల్ని కుమ్మికెలిపోయింది! గుడ్డిముక్కల్ని తన్నికెలిపోయింది!

పాత పుస్తకం సిరిగిపోయింది
తాత సంతకం సెరిగిపోయింది!

నేలదప్పికి తీర్సడాకి నావొళ్ళిప్పుడు ‘సెవటసెలమ’ కాదు, మెతుకుగింజకు సితిపేర్సిన ఎండాకాలపు ఇసకదిబ్బ..
ములగశిరకార్శిలోని నల్లమబ్బులాటి మనసిప్పుడు కరిగి సినుకై రాలడానికీ సిరాకుపడతంది!

తడి సమ్మంధం తెగిపోయింతరవాత పొడిమాటల పలకరింపుల్తప్ప ఎదురొచ్చి పొదువుకోడాలుండవు! మన్ను నన్ను మనిసిని సేత్తే నీను మట్టిగుండెని ఇనప దున్నకి వొప్పజెప్పీసేనని ఇప్పుడు బాధపడతన్ను ..!
అన్నీ తెలిసి అగ్గేనంల బడ్డాను. అగ్గిల సేతులెట్టి ఆకులు పట్టుకోవడాకి అవస్త పడతన్ను… బండినేదు బక్కనేదు. నక్కునేదు నాగల్నేదు. తాడూ తలువూ, బుట్టా బరిగీ ఎటెగిరిపోనాయో తెల్దు.
కళ్ళం నేదు గడ్డికుప్పల్నేవు. గాదీనేదు గాదిల దాన్నిమూ నేవు. కాల్ళల్ల కోడిపిల్లల్లాగ తిరిగిన గుంటల్నేరు. దిసబోడిగున్నాను నా ఆడదాయితోటి..!
తలపాగా సుట్టడమే మరిసిపోయినోడ్ని తువ్వాలు దులిపి రైతునని ఎలగ సెప్పుకోగల్ను!?
నానిప్పుడు ా ‘సూరీడు నుదుటిమీద సుక్కబట్టెట్టాలని కలలు గనీ కాటాలో తేలిపోతున్న మాఘమాసపు జన్నపిక్కని. రైతులేని కాలానికి మడిసెక్కను యేలాడదీస్సి పామాయిలు కొమ్మ మీద రెక్కలు ముడుసుకొని కూకున్న కళింగోర పిట్టని ..!
ా లాంగుల్య

➡️