వడగాడ్పు గానం!

Apr 8,2024 03:50 #Kavitha

ఉషస్సులు ప్రకాశించనూ లేదు
తపస్సులు తీరం చేర్చనూ లేదు
కాల లోలకం అటూ ఇటూ
నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉంది
సొంత ప్రమేయమూ ప్రయోజనమూ లేని దేహం
అటో ఇటో తిరుగాడుతుంది
తప్పనిసరి బాధ్యతల బరువు
తిప్పలు పెట్టయినా తిప్పుతూనే ఉంది!
ఒంటరి కోయిల గాయాల గేయాల్లోని
ఆత్మ నివేదన, రోదన ఎవరికి పడుతుంది?
వడగాలి వీస్తూనే ఉంది
ఆకులు రాలుతూనే ఉన్నాయి!
చలి రంపపు కోత పెడుతుంది
భీకర వర్షం ఒంటరిగా కురిసిపోతుంది
వసంతం మాత్రం దూరపు కొండల్లోని
అదృశ్యపు ధరహాసం!
పంచాంగం ఉల్లేఖిస్తుంది కానీ,
నీ వాకిలిలో ఏ మార్పూ ఉండదు
నీ మనసును ఏ వెన్నెలా తాకదు
అయినా,
కాల లోలకం విసుక్కోదు విశ్రమించదు
నిన్ను చిలక్కొయ్యలా అతికించుకుని
అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది!
ఎప్పుడు ఆగుతుందో ఎక్కడ ఆగుతుందో
దానిక్కూడా తెలియదు,
అచ్చం ఒంటరి కోయిల వడగాడ్పు గానంలా …
– టీనా, 94901 32174

➡️