బాండ్లపై మరికొన్ని వివరాలు

Mar 18,2024 08:24
  •  ఇసి వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్‌ బాండ్ల కొత్త సమాచారం
  •  బిజెపికే రూ.6,986.5 కోట్లు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం మళ్లీ వెబ్‌సైట్‌లో పెట్టింది. సుప్రీంకోర్టు సూచనతో బాండ్ల వివరాలను మరోసారి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఎక్స్‌లో ఇసి పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇటీవల ఇసికి ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను పిడిఎఫ్‌ రూపంలో అందించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇసి డేటాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎస్‌బిఐ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నెంబర్లను ఎన్నికల కమిషన్‌కు అందించకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం ఎస్‌బిఐ తీరును తప్పుపట్టింది. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడిపై ఈనెల 11న తాము ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించలేదంటూ మండిపడింది.
బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్స్‌ లేకపోవడంతో ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చిందో స్పష్టంగా తెలియడం లేదని.. బాండ్లతో ముడిపడిన అన్ని వివరాలను వెల్లడించాలని గతంలోనే ఆదేశించినా ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.. ఎస్‌బిఐకి నోటీసులు జారీ చేసింది. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బిజెపికి రూ.6,986.5 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లు వచ్చాయి. 2019-20లోనే రూ.2,555 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్లు వచ్చాయి. టిఎంసి రూ.1,397 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1,334.35 కోట్లు, వైసిపికి రూ.442.8 కోట్లు, టిడిపికి రూ.181.35 కోట్లు, బిఆర్‌ఎస్‌కి రూ.1,322 కోట్లు, డిఎంకెకి రూ.656.6 కోట్లు, బిజెడికి రూ.944.5 కోట్లు, జెడిఎస్‌కి రూ.89.75 కోట్లు, శివసేనకు రూ.60.4 కోట్లు, ఆర్‌జెడికి రూ.56 కోట్లు, ఎస్‌పికి రూ.14.05 కోట్లు, అకాలీదళ్‌కి రూ.7.26 కోట్లు, అన్నాడిఎంకెకి రూ.6.05 కోట్లు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కి రూ.50 లక్షలు వచ్చాయి. సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్‌ పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్లు స్వీకరించలేదు. అందుకు అవసరమైన అకౌంట్‌ కూడా తీసుకోలేదు. బిఎస్‌పి, ఎంఐఎం పార్టీలకు ఎలాంటి విరాళాలు అందలేదు.

 2019 ఎన్నికలకు ముందే బిజెపికి బాండ్ల ద్వారా రూ. 3962 కోట్లు
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి అక్షరాల రూ.3,962 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళంగా వచ్చాయి. బిజెపి ఎన్నికల కమిషన్‌కు అందజేసిన సీల్డ్‌ కవర్‌ డేటాలోని వివరాలను ఇసి విడుదల చేసింది. ఎన్నికల బాండ్లు ఇచ్చిన దాతల పేర్లు, వివరాలను పార్టీ నిర్వహించాల్సిన అవసరం లేదు కాబట్టి, వాటి జాబితా వెల్లడించడం లేదని లేదని తెలిపింది. అయితే బాండ్లను నగదు రూపం లోకి మార్చుకున్నట్లు తెలిపింది. ఎన్నికల బాండ్ల ద్వారా 2019 ఎన్నికల ముందు వరకూ బిజెపి రూ.3962 కోట్లు సంపాదించింది. ఈ మొత్తాన్ని 2019 ఎన్నికల్లో బిజెపి ఖర్చు చేసినట్లు భావిస్తు న్నారు. బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం భారత్‌లో జరిగిన 2019 ఎన్నికలు ప్రపంచంలోనే అతి ఖరీదైనవి. 2016 అమెరికా ఎన్నికలు (డొనాల్డ్‌ ట్రంప్‌ విజేతగా నిలిచిన ఎన్నికలు) కంటే కూడా భారత్‌ ఎన్నికలే ఖరీదైనవి కావడం విశేషం. ఇసి వెల్లడించిన వివరాల ప్రకారం బిజెపికి 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2,10,00,02,000, 2018-19లో రూ.14,50,89,05,000, 2019-20లో రూ.25,55,00,01,000 విరాళాలుగా వచ్చాయి. 2020-21లో రూ.22,38,50,000, 2021-22లో రూ.10,33,70,00,000, 2022-23లో రూ. 2,94,14,99,000 విరాళాలుగా అందాయి. 2023-24లో (2023 సెప్టెంబరు 30 వరకూ) రూ.4,21,27,51,000 విరాళాలుగా వచ్చాయి.

➡️