నిర్ణీత కాలపరిమితిలో విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

Apr 12,2024 21:17

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విద్యుత్‌ వినియోగదారుల పంపిణీ సంస్థ అందించాల్సిన సేవలను కాల పరిమితి లోగా అందజేయాలని సిజిఅర్‌ఎఫ్‌ చైర్మన్‌, విశ్రాంత న్యాయమూర్తి బి.సత్యన్నారాయణ అన్నారు. శుక్రవారం విద్యుత్‌ భవనంలో విద్యుత్‌ సమస్యలు పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలను విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యలు పరిష్కారంలో సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తే వినియోగదారులు తమ తమ సమస్యలను న్యాయ స్థానం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చునన్నారు. సమస్యలను ముందుగా తమ ప్రాంత పరిధిలోని విద్యుత్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ స్థాయి గల సిబ్బందికి తెలపాలని సూచించారు. 1912 టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. తరువాత పంపిణీ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం వహించి వినియోగదారులకు ఇబ్బంది కల్గించినా, సమస్యను పరిష్కరించ కుండా కాలయాపన చేసినా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని తెలిపారు. సమస్య పరిష్కారంతో పాటు సేవ అమలులో జాప్యానికి పరిహారం కూడా సంస్థ చెల్లిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఇ ఎం.లక్ష్మణరావు, ఇఇ పూడి హరి, విద్యుత్‌ శాఖ అధికారులు, వినియోగధారులు పాల్గొన్నారు.

➡️