అంగన్‌వాడీల పోరాటానికి…కవులు, రచయితల సంఘీభావం

  • కవితలు, గేయాలతో అంగన్‌వాడీలను ఉత్సాహపరచిన కవులు
  • ‘శ్రామిక కవనం’తో మద్దతు

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనకు కవులు, రచయితలు, గాయకులు సంఘీభావం ప్రకటించారు. 38 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారి ఆందోళనకు పూర్తి మద్దతు ఉంటుందని కవులు తమ కవితలు, గానంతో మద్దతు తెలిపారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా గురువారం సాయంత్రం ‘శ్రామిక కవనం’ నిర్వహించారు. కవులు, రచయితలు, గాయకులు తమ కవితలతో అంగన్‌వాడీలను ఉత్సాహపరచారు. సాహితీ స్రవంతి, జనసాహితీ, అరసం, విరసం, ఎపి రచయితల సంఘం, ఎక్స్‌రే సాహితీ సంస్థ, ఎపి ప్రజానాట్య మండలి నుండి పెద్ద సంఖ్యలో కవులు పాల్గొన్నారు. సాహితీ స్రవంతి బాధ్యులు వోర ప్రసాద్‌, శాంతిశ్రీ సమన్వయపరుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వొర ప్రసాద్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, వారిపై ప్రభుత్వం ఎస్మా వంటి చర్యలను ప్రకటించడం సరికాదన్నారు. ఉద్యమాల సమయంలో ఎంతో మంది కవులు తమ కవితలు, కథలు, గేయాలతో ప్రజలను ఉత్తేజపరిచారని, అదేవిధంగా అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు తెలుపుతూ పెద్దసంఖ్యలో కవులు పాల్గొని ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తారని తెలిపారు. విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కథా రచయిత్రి కె.ఉషారాణి మాట్లాడుతూ అంగన్‌వాడీలపై ఎస్మాను ప్రయోగించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో మెజీషియన్‌ క్రాంతికార్‌, ఎపి రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్‌, ఎక్స్‌రే సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంజనేయకుమార్‌రాజు, ప్రజా నాట్యమండలి నాయకులు అనిల్‌ చంద్ర నాయక్‌, జగన్‌, అప్పన్న, అనీఫ్‌, కవులు యడవల్లి శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌, గడ్డం విజయరావు, కెఎక్స్‌ రాజు పాల్గొని తమ కవితలను వినిపించారు. కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు జి.నారాయణ, కవి గుమ్మా సాంబశివరావు, నగర ప్రముఖులు గోళ్ల నారాయణరావు పాల్గొన్నారు. తమకు మద్దతు ప్రకటించిన కవులు, రచయితలు, గాయకులకు అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నుంచి బేబీ రాణి ధన్యవాదాలు తెలిపారు.

➡️