మితిమీరిన రేషన్ బియ్యం అక్రమ రవాణా

Dec 17,2023 23:38

ప్రజాశక్తి – భట్టిప్రోలు
రేషన్ మాఫియా పెచ్చరిల్లుతుంది. ప్రతినెలా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. బియ్యం మాఫియా కొల్లూరు, వేమూరు మండలాల నుండి కూడా సేకరించి లారీల ద్వారా తరలిస్తున్నారు. వీరి అక్రమాలకు బియ్యం పంపిణీ వాహనాలే ప్రధానం కావటం గమనార్హం. గ్రామాల్లో డీలర్ల వద్ద మిగిలిపోయిన బియ్యం గుట్టు చప్పుడు కాకుండా వాహన దారులు అక్రమార్కుల వద్దకు చేర్చి వాటిని లారీలకు ఎక్కిస్తూ ఉంటారు. స్థానికంగా దీపాల శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావు ఇరువురు అన్నదమ్ములు గత కొన్నేళ్లుగా బియ్యం అక్రమ రవాణా నిర్వహిస్తున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ మామూలు పుచ్చుకొని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ ఉన్నాయి. గత కొన్ని నెలలుగా బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి బియ్యాన్ని స్వాధిని చేసుకున్న సంఘటన ఉన్నాయి. కానీ వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి సంబంధిత బాధ్యులైన శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావులపై పిడి చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వ్యాపారం మాత్రం ఎక్కడా ఆగలేదు. కొనసాగుతూనే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఓ రేషన్ వాహన నుండి బియ్యాన్ని అక్రమంగా లారీకి ఎక్కిస్తుండడంతో కొందరు స్థానికులు ఫోటోలు, వీడియోలు తీయడంతో అది కాస్త సామాజిక మధ్యమాలో వైరల్ అయింది. దీంతో మండల స్థాయి అధికారులు అప్రమత్తమై బియ్యం వాహన దారులందరినీ తహశీల్దారు కార్యాలయానికి పిలిపించి హెచ్చరించినట్లు తెలిసింది.
అక్రమార్కులు ఎవరనేది తెలిసినా చర్యలేవి?
భట్టిప్రోలు కేంద్రంగా చేసుకొని వివిధ మండలాల నుండి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ముఠా ఎవరనేది తెలిసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. రేషన్ మాఫియా అధికార పార్టీ నాయకులు, అధికారుల కనుసనల్లోనే జరుగుతుందని ఆరోపిస్తున్నారు. దీని కారణంగానే అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక పెట్రోల్ బంక్, మార్కెట్ యార్డు సమీపంలో అర్ధరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా లారీలకు ఎక్కించి తరలిస్తున్నప్పటికీ రాత్రి వేళల్లో బీటు కానిస్టేబుల్ గాని, రెవిన్యూ సిబ్బంది గానీ, విజిలెన్స్ అధికారులు కానీ గంటలకు కొద్ది జరిగే బియ్యం లోడింగ్ వ్యవహారం కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి రేషన్ అక్రమ తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️