చర్మ సంరక్షణ ఇలా …

Dec 23,2023 11:04 #Jeevana Stories

చలికాలంలో చల్లగాలికి చర్మం పొడిబారుతుంది. తెల్లగా పగుళ్లు ఏర్పడతాయి. చర్మాన్ని కాపడుకునేందుకు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వేడి నీటితో స్నానం వద్దు : చలికాలంలో దాదాపు అందరూ వేడినీటితో స్నానం చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. దీనివల్ల చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది. చర్మం మరింత పొడిగా తయారవుతుంది. కాబట్టి స్నానానికి ముందు శరీరం అంతా ఆయిల్‌ రాసుకుని గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

ఆరోగ్యకరమైన ఆహారం : శరీరం పొడి బారకుండా మంచినీళ్లు తాగుతుండాలి. దాంతో పాటు నీరు శాతం ఎక్కువగా ఉన్న సొరకాయ, దోశకాయ, పొట్లకాయ, ఆకుకూరలు తినాలి. ఈ సీజన్‌లో దొరికే సి, ఎ విటమిన్స్‌ ఉన్న కమల, యాపిల్‌, ద్రాక్ష పండ్లను తీసుకోవాలి.

వ్యాయామం : వ్యాయామంతో చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీరంలో ఆక్సీకరణ స్థాయిలు వృద్ధి చెంది, శరీరానికి తగినంత ఆక్సిజన్‌ అందుతుంది. రక్తం చర్మ కణాలను కీలక పోషకాలతో నింపుతుంది. దీంతో చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. నడక, పరుగు లేదా ఏదైనా ఇతర ఆటలు ఆడటం ద్వారా ఆరోగ్యకర రక్తప్రసరణ జరిగి, చర్మాన్ని కాపాడుకోవచ్చు.

శనగపిండి మిశ్రమం : కప్పు శెనగపిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా పెరుగు లేదా పాలు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు శరీరానికి పట్టించాలి. కాసేపటి తర్వాత మృదువుగా రుద్దుకోవాలి. అరగంటయ్యాక స్నానం చేయాలి. దీని వల్ల చల్లగాలులకు చర్మం పొడిబారకుండా ఉంటుంది.

తక్కువ గాఢత ఉన్న సబ్బు : గాఢత గుణాలు అధికంగా ఉన్న సబ్బుల్ని వాడడం వల్ల చర్మం మరింత పొడిబారిపోయే ప్రమాదం ఉంది. ఈ కాలంలో గ్లిజరిన్‌ ఆధారిత సబ్బుల్ని ఉపయోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మతత్వాన్ని బట్టి ఏ సబ్బు సరిపోతుందో, పరిశీలించి వాడాలి.

➡️