గాజా యుద్ధానికి ఆరు మాసాలు

Apr 7,2024 00:15 #Gaza war, #Six months

-వేలల్లో మరణాలు, అంచనాలకు అందని విధ్వంసం
– ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంపై సర్వత్రా ఆందోళన
– కాల్పుల విరమణపై కైరోలో నేడు చర్చలు
గాజా : అమెరికా అండదండలతో యుద్ధోన్మాదంతో ఊగిపోతూ గాజా, పరిసర ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ చేపట్టిన అమానవీయ దాడులు మొదలై ఆరు నెలలు పూర్తయ్యింది. చిన్నారులు, మహిళలు సహా వేలాది మంది అమాయక పౌరులు, వారికి సహాయం చేసేందుకు వెళ్లిన కార్యకర్తలు, పాత్రికేయులు ప్రాణాలు కోల్పోయినా, తినేకి తిండి దొరక్క..తల దాచుకునే దిక్కులేక అవస్థలు పడుతున్నా ఇజ్రాయిల్‌ వైఖరిలో ఇసుమంతైనా మార్పు రావడం లేదు. గతేడాది అక్టోబరు 7న మొదలు పెట్టిన ఈ ఊచకోతలో హమాస్‌ నియంత్రణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 182 రోజుల్లో దాదాపు 33 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే లెక్కల్లోకి రాని మరణాల సంఖ్య చాలానే వుంటుందని భావిస్తున్నారు. శిధిలాల కింద సమాధి అయిపోయినవారి సంఖ్య కూడా వేలల్లోనే వుంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధంలో తల్లిదండ్రులను కోల్పోయి వేల సంఖ్యలో పిల్లలు అనాధలుగా మారిపోయారు. తినడానికి తిండి, నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డారు. ఇక విధ్వంసం, ఆస్తి నష్టం అంచనాలకు కూడా అందని రీతిలో వుంది.
కైరోలో చర్చలకు హమాస్‌ బృందం
కాల్పుల విరమణపై ఆదివారం కైరోలో జరగనున్న చర్చలకు తమ బృందాన్ని పంపిస్తున్నట్లు హమాస్‌ వర్గాలు శనివారం తెలిపాయి. శాశ్వతంగా కాల్పుల విరమణ జరగాలనేది తమ డిమాండ్లలో ప్రధానమైనదని హమాస్‌ తెలిపింది. గాజా నుండి ఇజ్రాయిల్‌ సైన్యం వైదొలగాలని, గాజా నుండి వెళ్ళిపోయిన పాలస్తీనియన్లనందరూ తిరిగి వారి స్వస్థలాలకు, ఇళ్ళకు తిరిగి రావాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రజల స్వేచ్ఛా రాకపోకలు, ప్రజలకు ఆహారం, వసతి సదుపాయాలు, బందీల మార్పిడి ఒప్పందం తమ డిమాండ్లని స్పష్టం చేసింది. మార్చి 14న తమ వైఖరి ఏదైతే స్పష్టం చేశామో దానికే కట్టుబడి వున్నామని పేర్కొంది. గత 24 గంటల్లో 45 మంది పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్నట్లు ఇజ్రాయిల్‌ బలగాలు తెలిపాయి. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన పాలస్తీనియన్ల సంఖ్య 8,080కి చేరినట్లు పాలస్తీనా ఖైదీల సొసైటీ తెలిపింది.
నెతన్యాహుకు బైడెన్‌ ఫోన్‌కాల్‌
ప్రజలకు హాని కలగకుండా, మానవతా సాయానికి అడ్డంకులు లేకుండా, సహాయ సిబ్బంది భద్రతకు ప్రమాదం లేకుండా తీసుకునే చర్యలపైనే అమెరికా గాజా విధానం ఆధారపడి వుంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహుకు ఫోన్‌ చేశారు. వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ బృందంపై దాడి నేపథ్యంలో గాజాకు తమ సాయాన్ని నిలిపివేసినట్లు ఎన్‌జిఓ ఓపెన్స్‌ ఆర్మ్స్‌ ప్రకటించింది. ఉత్తర గాజాలోని బీట్‌ హనూన్‌ నగరంలో ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడిలో ఒక పేరా మెడికోతో సహా నలుగురు మరణించారు. ఇప్పటివరకు సాగిన ఈ యుద్ధంలో వెయ్యి మందికి పైగా పిల్లలు ఒక కాలునో లేదా రెండు కాళ్ళనో పోగొట్టుకున్నారని పాలస్తీనా రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ తెలిపింది. గాజాలో ప్రతి గంటకు నలుగురు పిల్లలు మరణిస్తున్నారని తెలిపింది.

కొన్ని కీలక పరిణామాలు..
– ‘ఆపరేషన్‌ అల్‌-అక్సా స్ట్రామ్‌’ పేరిట గతేడాది అక్టోబర్‌ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపుదాడికి పాల్పడిన హమాస్‌ మిలిటెంట్లు.. వందలాది మంది చనిపోయారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్‌.. హమాస్‌ తీవ్రవాదులను హతమార్చే పేరుతో గాజాపై యుద్ధానికి తెరలేపింది. అయితే అమాయక పాలస్తీనయన్లను బలితీసుకుంటోంది.
ా బందీల్లో ఇప్పటివరకు 109 మంది హమాస్‌ సురక్షితంగా విడుదలు చేసింది. ముగ్గురిని సైన్యం కాపాడింది. 12 మంది మఅతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు ఇజ్రాయిల్‌ సొంత సైన్యం చేతిలోనే మఅతి చెందారు. మిగిలినవారిలోనూ 34 మంది చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. అయితే వీరంతా కూడా ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారని హమాస్‌ ప్రకటించింది.
-మరోవైపు తమవారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. నిత్యం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
– గాజాలో ఇజ్రాయిల్‌ యుద్ధానికి 33 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే. ఐరాస వివరాల ప్రకారం.. దాదాపు 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. స్థానికంగా 56 శాతానికిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. అటు.. లెబనాన్‌లోని హెజ్‌బల్లాతోపాటు సిరియాలోని ఇరాన్‌ మద్దతుదారులపైనా నెతన్యాహు సైన్యం అమానవీయ దాడులు చేస్తోంది.
– యుద్ధం మొదట్లో గాజా సరిహద్దులను దిగ్బంధించడంతో.. ఆహారం, ఇంధనం, ఔషధాలు, మంచినీరు, నిత్యావసర సామగ్రి కొరతతో పౌరులు అల్లాడారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రతిఒక్కరూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఉత్తర ప్రాంతంలో 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది.
– ఇజ్రాయిల్‌ ఒకవేళ రఫాకు దాడులను విస్తరిస్తే.. మొత్తం 23 లక్షల మంది జనాభాలో సగం మంది క్షుద్బాధకు లోనవుతారని ఇటీవల హెచ్చరించింది.
– అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు పాలస్తీనీయన్లకు కొంతమేర మానవతా సాయానికి ఇజ్రాయెల్‌ ఒప్పుకోవాల్సివచ్చింది. కానీ పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతోంది. దీంతో అరకొర సాయాన్ని కూడా సరిగ్గా చేరవేయలేని దుస్థితి నెలకొందని స్వచ్ఛందసంస్థలు ఆరోపిస్తున్నాయి.
– గాజాకు సముద్రమార్గంలో ఆహార సాయం అందిస్తోన్న ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ సిబ్బందిపై ఇటీవల ఇజ్రాయెల్‌ చేపట్టిన డ్రోన్‌ దాడిలో ఆరుగురు మృతి చెందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– గాజాలో అమాయక పౌరులను చంపడాన్ని నిరసిస్తూ, అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ పాలస్తీనియన్లకు మద్దతుగా ఎర్ర సముద్రంలోనూ, గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లోనూ వాణిజ్యనౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. వీరికి ఇరాన్‌ మద్దతిస్తోంది. వీరిపైనా అమెరికా, బ్రిటన్‌ సంకీర్ణ సేనలు దాడులు చేస్తున్నాయి.
– దాడులను వెంటనే ఆపాలని అనేక దేశాలు ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ సమాజం పదేపదే డిమాండ్‌ చేస్తోంది. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రత మండలి, మానవహక్కుల మండలిలు తీర్మానం రూపంలో గొంతెత్తాయి. అయినా కుక్క తోక తరహాలో ఇజ్రాయిల్‌ తన యుద్ధన్మోదాన్ని కొనసాగిస్తోంది.
– ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలపై దక్షిణాఫ్రికా, కొలంబియాలు అంతర్జాతీయ న్యాయస్థానం దఅష్టికి తీసుకెళ్లాయి. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఉత్తర్వులు జారీ చేసింది.

➡️