కలెక్టరేట్ల ముట్టడి

Dec 16,2023 10:12

 

పలువురి అరెస్టు, విడుదల నాలుగు వేలు పెంచి, పది వేలు పెంచినట్లు అబద్దపు ప్రచారం

సమస్యలు పరిష్కరించకపోతే గుణపాఠం

ముగిసిన ఆశాల 36 గంటల ధర్నా

ప్రజాశక్తి – యంత్రాంగం : సమస్యలు పరిష్కరించాలని రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో పలు జిల్లా కలెక్టరేట్లను ఆశాలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలు చోటు చేసుకున్నాయి. పలువురి నాయకులకు బలవంతంగా అరెస్టు చేశారు. కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన ఆశావర్కర్లు చేపట్టిన 36 గంటల దీక్షలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. దీక్షలకు సిపిఎం, సిపిఐ, జనసేనపార్టీ, టిడిపి నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 36 గంటల పాటు ఆశా వర్కర్లు చేపట్టిన మహాధర్నాను పోలీసులు భగం చేశారు. సుమారు 600 మందిని అక్రమంగా అరెస్టు చేశారు. పోలీస్‌ బ్యారెక్స్‌లో ఉన్న కల్యాణ మండపానికి తరలించి మధ్యాహ్నం విడిచిపెట్టారు. అనకాపల్లిలో కలెక్టరేట్‌ను ఆశా వర్కర్లు ముట్టడించారు. అల్లూరి జిల్లా పాడేరు ఐటిడిఎ వద్ద మహా ధర్నా చేశారు. శ్రీకాకుళం నగరంలోని జ్యోతిరావు పూలే పార్కు నుంచి కలెక్టరేట్‌కు ఆశా వర్కర్లు ర్యాలీగా బయలుదేరగా.. వాంబే కాలనీ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులను ప్రతిఘటిస్తూ ముందుకు దూసుకెళ్లడంతో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు పి.తేజేశ్వరరావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.నాగమణి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతితో పాటు 185 మందిని అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు.పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లను, సిఐటియు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు నాయకులను అరెస్టు చేసి సీతానగరం స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తరువాత విడిచిపెట్టారు. ఏలూరు కలెక్టరేట్‌ను ముట్టడించడానికి వందలాదిమంది ఆశాలు ప్రదర్శనగా కలెక్టర్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు తమ వద్దకు రాకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆశవర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు కె.పోశమ్మ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డిఎంహెచ్‌ఒకు వినతిపత్రం అందజేశారు. రాజమహేంద్రవరంలో ఆశావర్కర్లు ఎరుపు రంగు దుస్తులు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ధర్నా శిబిరానికి హాజరై మద్దతు తెలిపారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టరేట్‌ వద్ద ఆశాలు ధర్నాను నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌, శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద వంటా-వార్పుతో నిరసన దీక్షలు ముగిశాయి. అనంతపురంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, తదితరులు, పుట్టపర్తిలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మద్దతు తెలిపారు. ఉమ్మడి కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు.గుంటూరులో ఆశాల దీక్షలకు యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. చాకిరి బారెడు, జీతం మూరెడు అన్న చందంగా ఆశాల పరిస్థితి ఉందని అన్నారు. రూ. నాలుగు వేలు పెంచి, రూ.పది వేలు పెంచినట్లు అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ..కనీస వేతనాలు గానీ, సంక్షేమ పథకాలు గానీ ఇవ్వడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ..కనీస వేతనాలు రూ.26 వేలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, మృతి చెందిన ఆశాల కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. బాపట్ల పాత బస్టాండ్‌ ఆటోస్టాండ్‌ వద్ద జిబిసి రోడ్డుపై మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తలుగా అహర్నిశలూ సేవలందిస్తున్న ఆశావర్కర్లపై పని ఒత్తిడి పెంచితే చూస్తూ ఊరకోబోమని హెచ్చరించారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ..ఆశా వర్కర్ల 36 గంటల మహాధర్నా ప్రస్తుతం ట్రైలర్‌ మాత్రమేనని, ప్రభుత్వం తీరును బట్టి 2024లో అసలు సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ, కార్మికులు చూపిస్తారని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ..ఆశా, అంగన్‌వాడీల సమస్యల పట్ల స్పందించకుంటే రానున్న కాలంలో ప్రభుత్వ పీఠాలు కదులుతాయని హెచ్చరించారు. కె.ధనలక్ష్మి మాట్లాడుతూ… ఆశాలను తీవ్రమైన ఒత్తిడికి ప్రభుత్వం గురి చేస్తుందని, ఈ ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల కాలంలో గుండెపోటుతో అనేక మంది అకాలమరణానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

➡️