అభివృద్ధి ఏంటో చూపుతా..

అభివృద్ధి ఏంటో చూపుతా..

దగ్గుపాటి ప్రసాద్‌ను సన్మానిస్తున్న నాయకులు, కార్యకర్తలుఆశీర్వదించండి..

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

‘అనంతపురంలో కొన్ని కాలనీలు చూస్తుంటే నగరమో.. పల్లెటూరో.. అర్థం కావడం లేదు.. ఒక్కసారి ఆశీర్వదించి నాకు అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతా..’ అంటూ అనంతపురం అర్బన్‌ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం నగరంలోని 39వ డివిజన్‌ లక్ష్మీనగర్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతోపాటు టిడిపి మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ గడ్డం సుబ్రమణ్యం లాంటి సీనియర్‌ నాయకులు తనను ఆశీర్వదించడానికి రావడం సంతోషంగా ఉందన్నారు. తమకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే.. తాము ఎప్పుడో గెలిచామనిపిస్తోందన్నారు. ఇప్పుడు మెజార్టీ కోసమే తమ ప్రయత్నం అన్నారు. కానీ ప్రజల ఇబ్బందులు చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉందన్నారు. కాలనీల్లో కనీసం డ్రెయినేజీలు, తాగునీరు, చివరకు వీధిలైట్లు కూడా సరిగా ఏర్పాటు చేయలేని దుస్థితిలో పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్ల అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కచ్చితంగా టిడిపి అధికారంలోకి వస్తుందని, సమస్యలన్నీ పరిష్కరించి నగరాభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జకీవుల్లా, సీనియర్‌ నాయకులు గడ్డం సుబ్రమణ్యం, టిడిపి మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌస్‌ మోద్దీన్‌, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని, చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు, మాజీ కార్పొరేటర్‌ వడ్డే భవానీ, టిడిపి నాయకులు చేపల హరి, కూచి హరి, మోహన్‌ కుమార్‌, నెట్టం బాలకృష్ణ, లక్ష్మీనాయుడమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️