రేపటి నుంచి పలుచోట్ల జల్లులు

Apr 13,2024 07:50 #from tomorrow, #Showers

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. యానాంలో దిగు ట్రోపో ఆవరణంలో ఆగేయ దిశగా గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాలో ఈ నెల 13, 14 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనుండగా, దక్షిణ కోస్తాలో శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
57 మండలాల్లో వడగాడ్పులు
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 57 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ నెల 14న 9 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, మరో 111 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 13న వడగాడ్పులు వీచే మండలాల్లో శ్రీకాకుళం జిల్లా 15, విజయనగరం 16, పార్వతీపురం మన్యం 10, అల్లూరి సీతారామరాజు 1, అనకాపల్లి 3, కాకినాడ 5, తూర్పుగోదావరి 6, విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు సంస్థ పేర్కొంది. శుక్రవారం విజయనగరం జిల్లా జామిలో 41.2, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 40.8, కోనసీమ జిల్లా అయినవిల్లి, వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట, అన్నమయ్య జిల్లా పెద్ద మండ్యంలో 40.5, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40.1, కర్నూలు జిల్లా కామవరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సంస్థ సూచించింది.

➡️