అవ్వాతాతలతో జగన్ చెలగాటం! : అనగాని సత్య ప్రసాద్

  •  ఈసీ మీద వంకతో ఈ నెల పించన్లు ఎగ్గొట్టి మసలోళ్ళ నోట్లో మట్టి కొట్టాలన్నదే జగన్ రెడ్డి కుట్ర
  • ఒక్క పించన్ కూడా ఆగనివ్వం చివరి లబ్ది దారునికి పింఛన్ ఇచ్చే వరకు వైసీపీని వదిలిపెట్టం

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించిందని టిడిపి శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ”ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక వాలంటీర్లను రాజకీయ ప్రచారం కోసం వాడొద్దని ఎన్నికలు కమిషన్ పదేపదే స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్చగా నిబంధనలు తుంగలో తొక్కి వారిని వైసిపి ఎన్నికల ప్రచారానికి వాడుకుంటూ ఓటర్లను ప్రలోభపెడుతోంది.
వాలంటీర్లను విధుల నుంచి తప్పించడానికి వైసిపి నేతలే కారణం. రాజకీయ లబ్ధి కోసమే వైసిపి దుష్ప్రచారానికి దిగుతోంది. ఈసీ సంక్షేమ పథకాలు ఆపమని చెప్పిందా? సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దు అనే కదా చెప్పింది. పింఛన్లు ఇవ్వడం ప్రారంభమైన ఎన్టీఆర్ హయాం నుంచి వాలంటీర్లే పించన్లు ఇస్తూన్నారా ? వాలంటీర్లు లేకుండా గతంలో పింఛన్లు ఇవ్వలేదా? ఈసీ మీద వంకతో ఈ నెల పించన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి మసలోళ్ళ నోట్లో మట్టి కొట్టాలన్నదే జగన్ రెడ్డి కుట్ర ఒక్క పించన్ కూడా ఆగనివ్వం చివరి లబ్ది దారునికి పింఛన్ ఇచ్చే వరకు వైసీపీని వదిలిపెట్టం.” అని తెలిపారు.

”తొలిసారిగా వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్ కాగా, 200 రూపాయల పెన్షన్ ను పదిరెట్లు పెంచి 2వేల చేసింది చంద్రబాబునాయుడు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ఉన్న 3వేల పెన్షన్ ను 4వేలకు పెంచి, ఇంటివద్దకే వెళ్లి అందిస్తామని చంద్రబాబునాయుడు ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ జగన్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం దొడ్డిదారుల్లో అస్మదీయులకు వేలకోట్ల బిల్లులు చెల్లించి ఖజానా ఖాళీ చేయడం వాస్తవం కాదా? నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అవ్వాతాతలు ఇబ్బంది పడుతున్నా 3వేలపెన్షన్ హామీని చివరివరకు తాత్సారం చేసింది జగన్ రెడ్డి కాదా? గత అయిదేళ్లలో కుంటిసాకులతో 6లక్షల పెన్షన్లను తగ్గించి అవ్వ,తాతల ఉసురు తీసింది మీ దుర్మార్గపు ప్రభుత్వం కాదా? ఎన్నికలకు ముందు పెన్షన్ ను 3వేలకు పెంచుతామని అయిదేళ్లపాటు నాన్పుడు ధోరణితో సాగదీసి మోసగించింది వైసిపి ప్రభుత్వం కాదా? విజ్ఞులైన రాష్ట్రప్రజలు జగన్మోహన్ రెడ్డి కుట్రలను తిప్పికొట్టి, రాబోయే ఎన్నికల్లో వైసిపి దుష్ప్రచారాన్ని ప్రజలు ఓటుతో బుద్దిచెప్పడం ఖాయం. ఎన్నికల తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రూ.4వేల రూపాయలు పెన్షన్ ను చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అవ్వాతాతల ఇంటివద్దకే తీసుకెళ్లి ఇస్తుంది. వైసీపీ మాయ మాటల్ని ప్రజలు నమ్మొద్దని” ఆయన తెలిపారు.

➡️