షాడో వ్యయ రిజిస్టరు పక్కాగా నిర్వహించాలి

Apr 19,2024 22:32

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌: షాడో వ్యయ రిజిస్టరు పక్కాగా నిర్వహించాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు గుర్‌ కరణ్‌ సింగ్‌ అన్నారు. సహాయ వ్యయ పరిశీలకులతో జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో శుక్రవారం వ్యయ నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాలని, అందులో జరిగే కాఫీ, టీ, తాగు నీరు వంటి అంశాలతో సహా వాహనాల వినియోగం తదితర ప్రతి వ్యయాన్ని పరిశీలించాలని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి అశ్రద్ధ చేయరాదని ఆదేశించారు. అనుమతులు పొందిన వాహనాల వివరాలు నోడల్‌ అధికారి వద్ద ఉండాలని స్పష్టం చేశారు. వ్యయ నమోదులో పాటిస్తున్న విధానాలను సహాయ వ్యయ పరిశీలకులను అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్‌ రూమ్‌ ను సందర్శించిన పార్లమెంటరీ వ్యయ పరిశీలకులుజిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికలు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను అరకు పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులుగా గుర్‌ కరణ్‌ సింగ్‌ సందర్శించారు. జిల్లాకు విచ్చేసిన ఆయన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌, సోషల్‌ మీడియా, వ్యయం, ఫిర్యాదులు, చెక్‌ పోస్టుల పర్యవేక్షణ నియంత్రణ, జియో టాగింగ్‌ వాహనాల పర్యవేక్షణ తదితర విభాగాలను పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ ఎస్‌ శోబిక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పనితీరును వివరించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, ఎంసిసి నోడల్‌ అధికారి ఎండి గయాజుద్దీన్‌, సోషల్‌ మీడియా నోడల్‌ అధికారి యు.సాయి కుమార్‌, ఎంసిఎంసి నోడల్‌ అధికారి లోచర్ల రమేష్‌, సహాయ వ్యయ పరిశీలకులు ఆర్‌ రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️